తనపై సెటైర్ వేసిన పాకిస్థాన్ జర్నలిస్టుకు అదిరిపోయే సమాధానమిచ్చిన టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్

11-04-2021 Sun 21:00
  • 1996 వరల్డ్ కప్ లో క్వార్టర్ ఫైనల్లో తలపడిన భారత్, పాక్
  • పాక్ ఓపెనర్ సొహెయిల్ తో వెంకటేశ్ ప్రసాద్ పోరు
  • అహంభావంతో మాట్లాడిన సొహెయిల్
  • తర్వాత బంతికే ప్రతీకారం తీర్చుకున్న ప్రసాద్
  • నాటి ఘటనపై ప్రసాద్ ట్వీట్
  • పాక్ జర్నలిస్టు వ్యంగ్యం
Venkatesh Prasad counters Pakistan journalist

వన్డే ప్రపంచకప్ ఎప్పుడూ జరిగినా ఆ టోర్నీలో పాక్ పై భారత్ గెలవాల్సిందే. 50 ఓవర్ల వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు దాయాదిపై భారత్ అజేయ రికార్డు కలిగి ఉంది. స్వదేశంలో 1996లో జరిగిన వరల్డ్ కప్ కూడా భారత జట్టుకు చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఆనాటి క్వార్టర్ ఫైనల్ సమరంలో ఇరు జట్లు బెంగళూరులో అమీతుమీ తేల్చుకోగా, భారత్ ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా, పాక్ ఓపెనర్ అమీర్ సొహెయిల్ తో పేస్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ పోరు ఇప్పటికీ అభిమానుల మనోఫలకంపై కదలాడుతుంది.

వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్ లో కొన్ని బౌండరీలు కొట్టిన సొహెయిల్ అహంకారంతో మాట్లాడుతూ, ఇక నువ్వేసే ప్రతి బంతీ బౌండరీకే వెళుతుంది... వెళ్లి తెచ్చుకో అంటూ దురుసు వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత బంతికే వెంకటేశ్ ప్రసాద్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఓ అద్భుతమైన బంతితో సొహెయిల్ వికెట్లను గిరాటేశాడు. దాంతో ఆ పాక్ ఆటగాడికి తీరని అవమానం మిగలగా, వెంకటేశ్ ప్రసాద్ కు, భారత జట్టుకు అమితానందం కలిగింది.

తాజాగా ఈ ఘటనను వెంకటేశ్ ప్రసాద్ ట్విట్టర్ లో గుర్తుచేసుకున్నాడు. అయితే పాకిస్థాన్ కు చెందిన నజీబ్ ఉల్ హస్నైన్ అనే జర్నలిస్టు ఎగతాళి ధోరణిలో స్పందించాడు. నీ కెరీర్ లో ఇదొక్కటే ఘనకార్యం అనుకుంటా అని సెటైర్ వేశాడు. అందుకు వెంకటేశ్ ప్రసాద్ దీటుగా బదులిచ్చాడు. "ఇదొక్కటే కాదు నజీబ్ భాయ్! 1999లో ఇంగ్లండ్ గడ్డపై జరిగిన వరల్డ్ కప్ లో 27 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాను. ఆ మ్యాచ్ లో పాకిస్థాన్ 228 పరుగులు కూడా చేయలేక చతికిలపడింది. గాడ్ బ్లెస్ యూ" అంటూ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు.