లులూ గ్రూప్ ఎండీ కుటుంబానికి తప్పిన ప్రమాదం... హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

11-04-2021 Sun 16:59
  • భార్యతో కలిసి హెలికాప్టర్ లో ప్రయాణం
  • హెలికాప్టర్ లో సాంకేతికలోపం
  • వ్యవసాయ భూముల్లో ల్యాండింగ్
  • బురదలో కూరుకుపోయిన హెలికాప్టర్
Lulu group MD Yousuf Ali escapes from helicopter accident

గతంలో విశాఖలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన లులూ గ్రూప్ గురించి తెలిసిందే. తాజాగా ఆ సంస్థ ఎండీ యూసుఫ్ అలీ, ఆయన కుటుంబానికి పెద్ద ప్రమాదం తప్పింది. యూసుఫ్ అలీ కుటుంబం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కేరళలోని కొచ్చి వద్ద అత్యవసరంగా కిందికి దిగింది. హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్ పనంగడ్ వద్ద కేరళ యూనివర్సిటీకి చెందిన ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ క్యాంపస్ కు సమీపంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. హెలికాప్టర్ ను పొలాల్లో దించడంతో బురదలో కూరుకుపోయింది.

ఈ ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్ లో ఏడుగురు ఉన్నారు. లులూ గ్రూప్ ఎండీ యూసుఫ్ అలీ, ఆయన అర్ధాంగి క్షేమంగా ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. వారిరువురిని పరిశీలన కోసం ఆసుపత్రికి తరలించారు. యూసుఫ్ అలీ యూఏఈలో ఉంటున్నారు. ఆయన భారత సంతతి కోటీశ్వరుడు. ఆయన నేతృత్వంలోని లులూ గ్రూప్ కు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నాయి.