బెంగాల్ లో హింసకు మమతానే ఆజ్యం పోశారు: అమిత్ షా

11-04-2021 Sun 16:38
  • పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు
  • నాలుగో విడత పోలింగ్ లో కాల్పులు
  • నలుగురి మృతి
  • అమిత్ షానే కారణమన్న మమతా బెనర్జీ
  • మమతానే ప్రజలను రెచ్చగొట్టారన్న అమిత్ షా
Amit Shah alleges Mamata Banrjee fuels violence in Bengal

పశ్చిమ బెంగాల్ లో నిన్న ముగిసిన నాలుగో విడత ఎన్నికలు రక్తసిక్తం కావడం తెలిసిందే. కూచ్ బెహార్ లో సీఐఎస్ఎఫ్ బలగాలు ఓ పోలింగ్ కేంద్రం వద్ద జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం మమతా బెనర్జీ ఇది మారణహోమం అని పేర్కొన్నారు. ఇందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే బాధ్యత వహించాలని అన్నారు. దీనిపై అమిత్ షా స్పందించారు.

బెంగాల్ లో హింసకు సీఎం మమతా బెనర్జీనే కారకురాలు అని ఆరోపించారు. ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాలను అడ్డుకోవాలంటూ మమత ఇచ్చిన పిలుపు ప్రజలను రెచ్చగొట్టిందని అన్నారు. ఈ క్రమంలో వారు సీఐఎస్ఎఫ్ బలగాలపై దాడికి దిగారని వెల్లడించారు. చివరికి మరణాలను కూడా రాజకీయాలకు వాడుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని మమత వ్యాఖ్యలను తిప్పికొట్టారు. శాంతిపూర్ లోని ఓ సభలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. మిగతా విడత ఎన్నికల్లో ప్రశాంతంగా పోలింగ్ లో పాల్గొనాలని బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.