వకీల్ సాబ్ బెనిఫిట్ షోలను జగన్ రద్దు చేశాడంటే నేను నమ్మను: నాగబాబు

11-04-2021 Sun 16:00
  • ఇటీవల వకీల్ సాబ్ విడుదల
  • ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు
  • ఇది స్థానిక ఎమ్మెల్యేలు, నేతల పనై ఉంటుందన్న నాగబాబు
  • జగన్ కు తెలిస్తే తప్పకుండా స్పందిస్తాడని వ్యాఖ్యలు
Mega brother Nagababu comments on Vakeel Saab

పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం బెనిఫిట్ షోలను ఏపీలో రద్దు చేయడం పట్ల మెగాబ్రదర్ నాగబాబు స్పందించారు. ఏపీ సీఎం జగన్ అలాంటి పనులు చేస్తాడంటే తాను నమ్మనని పేర్కొన్నారు. పాలనా పరమైన కార్యక్రమాలతో జగన్ తీరికలేకుండా ఉంటారని, స్థానికంగా ఉండే కొందరు ప్రజాప్రతినిధులు, ఇతర రాజకీయనేతలు బెనిఫిట్ షోల రద్దుకు కారకులని తాను భావిస్తున్నట్టు వెల్లడించారు.

జగన్ కు ఈ విషయం తెలిస్తే తప్పకుండా స్పందిస్తారని నాగబాబు అభిప్రాయపడ్డారు. రాజకీయ పరమైన కారణాలతో వృత్తిపరమైన జీవితంపై ఇలా వ్యవహరించడం సరికాదని, సినిమాపై ఆధారపడే ఎంతోమంది కార్మికులు, వారి కుటుంబాలకు నష్టం వాటిల్లుతుందని అన్నారు.

ఇక, వకీల్ సాబ్ చిత్రంపైనా నాగబాబు తన అభిప్రాయాలు వెల్లడించారు. తాను పవన్ చిత్రం చివరిసారిగా చూసింది అత్తారింటికి దారేది అని తెలిపారు. అజ్ఞాతవాసి సినిమా రిజల్ట్ తమను బాధించిందని, మూడేళ్ల తర్వాత వకీల్ సాబ్ తో మళ్లీ పవన్ నటించడం సంతోషం కలిగించిందని చెప్పారు. ఈ సినిమాలో పవన్ నటించాడనడం కంటే రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడో అలాగే వ్యవహరించాడనడం కరెక్టుగా ఉంటుందని వివరించారు.