HCA: వాడీవేడిగా హైదరాబాద్ క్రికెట్ సంఘం సర్వసభ్య సమావేశం

War of words in Hyderabad Cricket Association AGM
  • హెచ్ సీఏ అంబుడ్స్ మన్ గా జస్టిస్ దీపక్ వర్మ నియామకం
  • గతంలో వాయిదాపడిన నియామకం
  • అప్పట్లో హెచ్ సీఏ అధ్యక్ష, కార్యదర్శుల మధ్య వివాదం
  • మరోసారి ఘర్షణ రిపీట్
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అజారుద్దీన్
ఎంఎల్ జయసింహ, వీవీఎస్ లక్ష్మణ్ వంటి మేటి క్రికెటర్లను భారత జట్టుకు అందించిన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారింది. అవినీతి ఆరోపణలు, సభ్యుల మధ్య విభేదాలు, బహిరంగంగానే ఘర్షణలతో హెచ్ సీఏ ప్రతిష్ఠ మసకబారింది. భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక కూడా హెచ్ సీఏ వర్గాల తీరు మారలేదు సరికదా మరింత ముదిరింది.

తాజాగా నిర్వహించిన హైదరాబాద్ క్రికెట్ సంఘం సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. జస్టిస్ దీపక్ వర్మను హెచ్ సీఏ అంబుడ్స్ మన్ గా నియమిస్తూ అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియామకంపై గతంలో ఓసారి హెచ్ సీఏ సమావేశం వాయిదా పడింది. అప్పుడు స్టేజీపైనా వాగ్బాణాలు సంధించుకున్న హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, కార్యదర్శి విజయానంద్... ఇవాళ్టి సమావేశంలోనూ అదే సీన్ రిపీట్ చేశారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్యే సర్వసభ్య సమావేశం ముగిసింది.

సమావేశం ముగిసిన అనంతరం అజర్ మీడియాతో మాట్లాడారు. హెచ్ సీఏలో వివాదాలను బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. సర్వసభ్య సమావేశంలో వివాదాలు సృష్టిస్తున్న వారికి షోకాజ్ నోటీసులు ఇస్తామని, సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. తాను హైదరాబాద్ క్రికెట్ అభ్యున్నతి కోసం కృషి చేస్తుంటే కొందరు అందుకు అడ్డుతగులుతున్నారని అజర్ ఆరోపించారు.
HCA
AGM
Aazharuddin
Vijayananad
BCCI

More Telugu News