పవన్ కల్యాణ్ ఒక పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్ట్: మంత్రి పెద్దిరెడ్డి

11-04-2021 Sun 14:46
  • పవన్ చంద్రబాబు దత్తపుత్రుడని వ్యాఖ్యలు
  • నిన్నమొన్నటి దాకా బీజేపీని తిట్టాడని వెల్లడి
  • ఇప్పుడా పాచిపోయిన లడ్డూలను ఇష్టంగా తింటున్నాడని ఎద్దేవా
  • బీజేపీకి తిరుపతిలో ఓట్లడిగే హక్కులేదన్న పెద్దిరెడ్డి
  • చంద్రబాబు రెఫరెండం సవాల్ ను స్వీకరిస్తున్నట్టు వెల్లడి
Minister Peddireddy terms Pawan Kalyan a political paid artist

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జనసేనాని పవన్ కల్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ కల్యాణ్ ఒక పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్ట్ అని అభివర్ణించారు. చంద్రబాబు దత్తపుత్రడని అన్నారు. నిన్నమొన్నటిదాకా బీజేపీని తిట్టిపోసిన పవన్ కల్యాణ్... పాచిపోయిన లడ్డూలనే ఇప్పుడు ఎంతో ఇష్టంగా తింటున్నాడని వ్యాఖ్యానించారు. తిరుపతిలో బీజేపీ-జనసేన-టీడీపీ లాలూచీ పడ్డాయని, ఓ ఒప్పందం ప్రకారం నడుచుకుంటున్నాయని పెద్దిరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చని బీజేపీకి తిరుపతిలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.

ఇక, తిరుపతిలో సీఎం జగన్ సభ రద్దుకు కరోనా వ్యాప్తే కారణమని స్పష్టం చేశారు. రోజుకు 3 వేల కేసులు వస్తుంటే బాధ్యతగల సీఎంగా జగన్ సరైన నిర్ణయం తీసుకున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. కరోనా ప్రభావంతోనే సభ రద్దు చేసుకున్నారు తప్ప మరో కారణం లేదని అన్నారు.

అటు, తిరుపతి ఉప ఎన్నిక బరిలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక హోదా రెఫరెండం సవాల్ ను స్వీకరిస్తున్నట్టు పెద్దిరెడ్డి తెలిపారు. తిరుపతిలో వైసీపీ ఓడిపోతే 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని, టీడీపీ ఓడిపోతే ముగ్గురు ఎంపీలు సహా రఘురామకృష్ణరాజుతో కూడా రాజీనామా చేయిస్తారా? అని ప్రతిసవాల్ విసిరారు.