ప్రజలు లాక్‌డౌన్‌ కోరుకోవడం లేదని మాకు తెలుసు: సంజ‌య్ రౌత్

11-04-2021 Sun 14:01
  • కొవిడ్‌పై యుద్ధం జరుగుతోంది
  • దీనిపై రాజకీయాలు చేయొద్దు
  • ఇది భార‌త్-పాక్‌ యుద్ధం కాదు
sanjay raut slams nda

బీజేపీ నేత‌ల‌పై మ‌హారాష్ట్ర‌లోని శివ‌సేన పార్టీ నేత సంజ‌య్ రౌత్ మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌హారాష్ట్ర‌లో క‌రోనా ప‌రిస్థితులు, లాక్‌డౌన్ గురించి కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌, మ‌హారాష్ట్ర‌ మాజీ సీఎం ఫడ్న‌వీస్‌ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న తిప్పికొట్టారు. కొవిడ్‌పై యుద్ధం జరుగుతోందని, దీనిపై రాజకీయాలు చేసేందుకు ఇది భార‌త్-పాక్‌ యుద్ధం కాదని వ్యాఖ్యానించారు.

ప్రజలు లాక్‌డౌన్‌ కోరుకోవడం లేదని తమకు కూడా తెలుసుని అన్నారు. అయితే, క‌రోనా నుంచి ప్ర‌జ‌ల ప్రాణాలను కాపాడేందుకు పరిష్కారం ఏంటని ఆయ‌న నిల‌దీశారు. ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ ఢిల్లీలో ఉంటూ, మ‌హారాష్ట్ర ప‌రిస్థితుల‌పై స‌ల‌హాలు ఇవ్వ‌కూడ‌ద‌ని ఆయ‌న చెప్పారు.

రాష్ట్రానికి వచ్చి పరిస్థితుల‌ను స్వయంగా చూడాలని చెప్పారు. కరోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో 3 వారాల పాటు కఠిన చర్యలు అవసరమని మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ తీసుకున్న నిర్ణ‌యం స‌రైందేన‌ని సంజ‌య్ రౌత్ అన్నారు. దేశ వ్యాప్తంగానూ కరోనా విజృంభిస్తోంద‌ని చెప్పారు. దేశంలో లాక్‌డౌన్  విధించాలా? వ‌ద్దా? అనేది ప్రధాన మంత్రి తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల తర్వాత కేంద్ర ప్ర‌భుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.