టీఆర్ఎస్‌ డబ్బు, మద్యం పంచినప్ప‌టికీ కాంగ్రెస్‌కే ఓటేస్తారు: ఉత్త‌మ్‌

11-04-2021 Sun 13:49
  • కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలుపు ఖాయం
  • సాగ‌ర్ ప్ర‌జ‌ల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందేమీలేదు
  • బీజేపీకి డిపాజిట్‌ కూడా ద‌క్కదు
uttam slams trs

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో అన్ని పార్టీలు ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పోటాపోటీగా పాల్గొంటున్నాయి. త‌మ అభ్య‌ర్థుల గెలుపుపై ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ నేత‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు నల్గొండ‌లో మీడియాతో మాట్లాడుతూ... తమ అభ్యర్థి జానారెడ్డి గెలుపు ఖాయమని విశ్వాసం వ్య‌క్తం చేశారు.

నాగార్జున సాగ‌ర్ ప్ర‌జ‌ల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇన్నాళ్లూ చేసిందేమీలేదని, ఈ విష‌యం అక్క‌డి ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని చెప్పారు. టీఆర్‌ఎస్ నేత‌లు ఎన్నికల నేప‌థ్యంలో ఓటర్లకు డబ్బు, మద్యం పంచినప్ప‌టికీ కాంగ్రెస్‌కే  ఓటేస్తారని ఆయ‌న అన్నారు. బీజేపీకి డిపాజిట్‌ కూడా ద‌క్క‌ద‌ని ఆయ‌న చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ కాంట్రాక్టర్ల కమీషన్ల కోసమే ప‌నిచేస్తోంద‌ని ఆరోప‌ణ‌లు గుప్పించారు.