కేసుల‌కు భ‌య‌ప‌డి కేంద్ర స‌ర్కారుని జ‌గ‌న్ ప్ర‌శ్నించ‌ట్లేదు: ఎంపీ రామ్మోహ‌న్

11-04-2021 Sun 13:10
  • ప్రత్యేక హోదాను ఆయ‌న‌ అటకెక్కించారు
  • ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయి
  • తిరుపతికి చాలా అన్యాయం జరుగుతోంది
ram mohan slams jagan

తిరుప‌తి ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తిరుపతి ప్రకాశం పార్కులో ప్ర‌చారంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ...  కేసులకు భయపడే కేంద్ర ప్ర‌భుత్వాన్ని సీఎం జగన్ ప్రశ్నించడంలేదని ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఆయ‌న‌ అటకెక్కించారని చెప్పారు. విభజన హామీల‌ అమలు, రైల్వే జోన్ గురించి అడ‌గ‌డం లేద‌ని తెలిపారు. ఆయ‌న పాల‌న‌లో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రానికి మంచి జరగాలంటే కేంద్ర స‌ర్కారుని ఎదిరించే వ్యక్తిని తిరుప‌తి ఉప ఎన్నిక‌లో గెలిపించాల‌ని ఆయ‌న కోరారు.  

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆంధ్ర‌ప్రదేశ్ అభివృద్ధి తిరోగమనంలో సాగుతోందని మండిప‌డ్డారు. గ‌త‌ టీడీపీ హయాంలో చంద్ర‌బాబు నాయుడు ఏపీ  అభివృద్ధి కోసం ఎన్నో మంచి కార్యక్రమాలను ప్ర‌వేశ‌పెట్టార‌ని ఆయ‌న చెప్పారు. ఏపీని పెట్టుబడులు పెట్టే ఒక హబ్‌గా త‌యారు చేసేందుకు ప్రయత్నాలు చేశారని ఆయ‌న చెప్పారు. తిరుపతిని చంద్ర‌బాబు నాయుడు ఒక స్థాయికి తీసుకువచ్చారని ఆయ‌న అన్నారు. ఇప్పుడు తిరుపతికి చాలా అన్యాయం జరుగుతోంద‌ని ఆయ‌న చెప్పారు.