ఇదొక మార‌ణహోమం: మ‌మ‌తా బెన‌ర్జీ తీవ్ర ఆగ్ర‌హం

11-04-2021 Sun 12:40
  • నిన్న‌ కూచ్‌బిహార్‌ లో సీఐఎస్ఎఫ్ బలగాలు కాల్పులపై మండిపాటు
  • ఆందోళ‌న‌కారుల‌ మోకాళ్ల కింద కాల్పులు జ‌ర‌పాల్సింది
  • మూక‌ల‌ను నియంత్రించే విష‌యంలో సీఐఎస్ఎఫ్‌కి అవ‌గాహ‌న లేదు
  • నిన్న రాత్రి నాకు నిద్ర ప‌ట్ట‌లేదు 
 Mamata Banerjee On Violence Outside Bengal Polling Booth

పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌ సంద‌ర్భంగా నిన్న‌ ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. కూచ్‌బిహార్‌ లో సీఐఎస్ఎఫ్ బలగాలు జ‌రిపిన కాల్పుల్లో న‌లుగురు మృతి చెందిన ఘ‌ట‌న‌పై ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

సిలిగురిలో ఆమె మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. కాల్పుల  ఘ‌ట‌న‌ను మార‌ణహోమంగా అభివ‌ర్ణించారు. నిజాల‌ను ఎన్నికల సంఘం అణ‌చివేసే ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని ఆమె ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఈ ఘ‌ట‌న‌కు వ్య‌తిరేకంగా తాము ఈ రోజు బ్లాక్ డే పాటించాల‌ని నిర్ణ‌యించామ‌ని తెలిపారు.

'ఇదో సామూహిక‌ హ‌త్యాకాండ‌. చంపేయ‌డానికే వారు (సీఐఎస్ఎఫ్‌) కాల్పులు జ‌రిపారు. వారు ఆందోళ‌న‌కారుల‌ మోకాళ్ల కింద కాల్పులు జ‌ర‌పాల్సింది. అస‌లు మూక‌ల‌ను నియంత్రించే విష‌యంలో సీఐఎస్ఎఫ్‌కి అవ‌గాహ‌న లేదు. పారిశ్రామిక ప్రాంతాల్లో ప‌నిచేసే విష‌యంపైనే వారు శిక్ష‌ణ తీసుకుంటారు' అని మ‌మ‌తా బెన‌ర్జీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

'మూక‌ల‌ను నియంత్రించే విష‌యంలో నిబంధ‌న‌లు ఉంటాయి. మొద‌ట లాఠీచార్జీ చేయాలి.. అనంత‌రం టియ‌ర్ గ్యాస్‌, వాట‌ర్ కెనాన్లు ప్ర‌యోగించాలి. ఈ విష‌యంలో నేను రాజ‌కీయాలు చేయ‌ద‌లుచుకోలేదు. నేను మొద‌టి నుంచి చెబుతున్నాను వారు ఓట‌ర్ల‌ను పోలింగ్ కేంద్రాల‌కు వెళ్ల‌కుండా అడ్డుకుంటున్నారు. ఓట్లు వేసేందుకు ప్ర‌జ‌ల‌ను వెళ్ల‌నివ్వాల్సిందే.. ఓట్ల ద్వారానే ప్ర‌జ‌లు త‌గిన రీతిలో బుద్ధి చెబుతారు' అని ఆమె వ్యాఖ్యానించారు.

ప్ర‌ధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఏమీ చేయ‌లేని అస‌మ‌ర్థులని మ‌మ‌తా బెనర్జీ విమ‌ర్శించారు. కాల్పుల ఘ‌ట‌న అనంత‌రం త‌న‌కు నిన్న రాత్రి నిద్ర ప‌ట్ట‌లేద‌ని, ప్ర‌ధాని మోదీ మాత్రం స్వీట్లు తింటూ గ‌డిపార‌ని ఆమె ఆరోపించారు. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు తాను వెళ్లాల‌నుకుంటున్నాన‌ని ఆమె చెప్పారు.

అయితే, ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఆంక్ష‌లు విధించార‌ని, అయిన‌ప్ప‌టికీ వెళ్తాన‌ని తెలిపారు. మోడ‌ల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ (ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళి) ను ఇప్పుడు మోదీ కోడ్ ఆఫ్ కండ‌క్ట్  గా మార్చార‌ని ఆమె మండిప‌డ్డారు. కేంద్ర‌ భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ప్ర‌జ‌ల‌పై దారుణాల‌కు పాల్ప‌డుతున్నాయ‌ని తాను తొలి ద‌శ ఎన్నిక‌ల నుంచి చెబుతున్నాన‌ని, కానీ త‌న మాట‌ల‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేద‌ని ఆమె వ్యాఖ్యానించారు.