శ్రీవిల్లిపుత్తూరు కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు కన్నుమూత

11-04-2021 Sun 12:08
  • నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అనారోగ్యం
  • గత నెల 20న కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిక
  • ఆయన తరపున ప్రచారం నిర్వహించిన కుమార్తె
Srivilliputhur Congress candidate PSW Madhava Rao passes away

శ్రీవల్లిపుత్తూరు కాంగ్రెస్ అభ్యర్థి పీఎస్‌డబ్ల్యూ మాధవరావు (63) కరోనాతో ఈ ఉదయం కన్నుమూశారు. కరోనా లక్షణాలతో బాధపడుతూ ఆయన గత నెల 20న మదురైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ అనే తేలింది. అయినప్పటికీ లంగ్ ఇన్ఫెక్షన్ సోకడంతో కొవిడ్ వార్డులోనే ఉంచి చికిత్స అందించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.

వ్యాపారవేత్త, లీగల్ కన్సల్టెంట్ కూడా అయిన మాధవరావు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. తమిళనాడు పీసీసీలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నారు. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే అనారోగ్యానికి గురైన ఆయన ప్రచారాన్ని కూడా నిలిపివేశారు. కొవిడ్ లక్షణాలతో మధురైలోని ఓ ఆసుపత్రిలో చేరారు.

దీంతో ఆయన కుమార్తె దివ్యారావు తండ్రి తరపున ప్రచారం నిర్వహించారు. తీవ్రమైన లంగ్ ఇన్ఫెక్షన్‌‌కు తోడు పలుమార్లు హార్ట్ ఎటాక్ కూడా వచ్చినట్టు వైద్యులు తెలిపారు. శనివారం ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. ఈ ఉదయం లంగ్ ఇన్ఫెక్షన్ కారణంగా తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు.