దక్షిణాఫ్రికా వేరియంట్‌పై ఫైజర్ టీకా ప్రభావం నిల్: ఇజ్రాయెల్ అధ్యయనంలో వెల్లడి

11-04-2021 Sun 10:45
  • టెల్ అవీవ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
  • రెండు టీకాలు తీసుకున్న వారిలోనూ సౌతాఫ్రికా వేరియంట్
  • మొత్తం 800 మందిపై అధ్యయనం
South African variant can break through Pfizer vaccine

కరోనా వైరస్‌లోని దక్షిణాఫ్రికా వేరియంట్‌ను ఫైజర్/బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన టీకా ఏమీ చేయలేదని ఇజ్రాయెల్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కరోనా బారినపడిన  తొలి/ రెండో దశ టీకా తీసుకున్న  400 మందిని, అంతే సంఖ్యలో టీకా తీసుకోని వారిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇందుకు సంబంధించిన నివేదికను నిన్న విడుదల చేశారు. టెల్ అవీవ్ యూనివర్సిటీ, క్లాలిట్‌లోని అతిపెద్ద హెల్త్‌కేర్ ప్రొవైడర్ నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం.. దక్షిణాఫ్రికా వేరియంట్ బి.1.351 అధ్యయనం చేసిన కొవిడ్ కేసుల్లో ఒక శాతం కనిపించింది.

టీకా రెండు మోతాదులు తీసుకున్న వారిలో వేరియంట్ వ్యాప్తి రేటు వ్యాక్సిన్ వేసుకోని వారితో పోలిస్తే 8 రెట్లు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. అంటే దీనర్థం ఈ వ్యాక్సిన్ దక్షిణాఫ్రికా వేరియంట్‌పై చూపే ప్రభావం అంతంత మాత్రమేనని. అయితే, ఒరిజినల్ వైరస్‌పై మాత్రం బాగానే పనిచేస్తున్నట్టు తేలింది.

రెండో మోతాదు టీకాలు తీసుకున్న వారితో టీకాలు తీసుకోని వారిని పోల్చినప్పుడు దక్షిణాఫ్రికా వేరియంట్ రేట్ అధికంగా ఉన్న విషయాన్ని తాము కొనుగొన్నామని టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన అధ్యయనకర్త అడీ స్టెర్న్ తెలిపారు.