Prince Philip: ఫిలిప్ అంత్యక్రియలకు హ్యారీ మాత్రమే... మేఘన్ రాబోరన్న రాయల్ ప్యాలెస్!

only Prince Harry not Merkel for Prince Philip Funeral
  • శనివారం మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు
  • ప్రస్తుతం గర్భవతిగా ఉన్న మేఘన్ మెర్కెల్
  • అంత్యక్రియలకు ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా గైర్హాజరు
  • కేవలం 30 మందికి మాత్రమే అనుమతి
క్వీన్ ఎలిజబెత్ -2 భర్త, గత వారం మరణించిన ఫ్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు ఈ వారంలో జరగనుండగా, ఆయన మనవడు, రాచరికాన్ని వదిలి ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్న ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మెర్కెల్ దంపతుల్లో హ్యారీ మాత్రమే హజరవుతారని రాయల్ ప్యాలెస్ పేర్కొంది. ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు శనివారం నాడు జరుగుతాయని, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి.

17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రకటించింది. లండన్ కు పశ్చిమ ప్రాంతంలో ఉన్నవిండ్ సర్ క్యాజిల్ పరిధిలోని సెయింట్ జార్జ్ చాపెల్ లో ఆయన ఖననం జరుగుతుందని పేర్కొంది. ఈ సందర్భంగా జాతి యావత్తూ మౌనం పాటిస్తుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం, 30 మంది అత్యంత దగ్గరి వారికి మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇక తన తండ్రి మరణం గురించి  ప్రిన్స్ చార్లెస్ ఓ ప్రకటన విడుదల చేశారు. "నా ప్రియాతి ప్రియమైన తండ్రి, నా జీవితంలో ఓ ప్రత్యేకమైన వ్యక్తి" అంటూ నివాళులు అర్పించారు. ఇటువంటి విషాద సమయంలో మా కుటుంబం ఎంతో చింతిస్తోందని ఆయన అన్నారు.

ఇదిలావుండగా, ప్రస్తుతం మేఘన్, గర్భాన్ని ధరించి వున్నారన్న సంగతి తెలిసిందే. వైద్యులు ఆమెను యూఎస్ నుంచి లండన్ వరకూ ప్రయాణం చేయవద్దని సూచించినట్టు సమాచారం. వారి సూచన మేరకే హ్యారీ మాత్రమే ఫిలిప్ అంత్యక్రియలకు రావాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కాగా, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం ఈ కార్యక్రమానికి హాజరు కాబోవడం లేదు. ఈ విషయాన్ని పేర్కొన్న డౌనింగ్ స్ట్రీట్ వర్గాలు పెరుగుతున్న కరోనా కేసులే ఇందుకు కారణమని వ్యాఖ్యానించాయి. సాధ్యమైనంత ఎక్కువ మంది కుటుంబీకులకు అవకాశం ఇవ్వాలనే బోరిస్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

కాగా, యూకే సంప్రదాయం ప్రకారం, ఫిలిప్ కు నివాళిగా, యూకే వ్యాప్తంగా 41రౌండ్ల గన్ సెల్యూట్ నిర్వహించాయి. లండన్ తో పాటు ఎడిన్ బర్గ్, కార్డిల్, బెల్ ఫాస్ట్ లతో పాటు నౌకాదళ కేంద్రాల్లో యుద్ధ నౌకల నుంచి మిలిటరీ ప్రొటోకాల్ ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లోని కాన్ బెర్రా, వెల్లింగ్టన్ లలోనూ గన్ సెల్యూట్ కార్యక్రమం జరిగింది.

Prince Philip
Prince Harry
Meghan Merkel
London
Funeral

More Telugu News