ముందుగానే అనుకున్నాం... అదే జరిగింది: ఓటమిపై ధోనీ!

11-04-2021 Sun 09:06
  • నిన్నటి మ్యాచ్ లో ఓడిపోయిన సీఎస్కే
  • టాస్ ఓడి పోవడమే కొంప ముంచింది
  • మరో 20 పరుగులు చేసుంటే బాగుండేది
  • పిచ్ పై తేమ ప్రభావం చూపిందన్న ధోనీ
We Thought Defete After Toss Loss Says Dhoni

నిన్న జరిగిన ఐపీఎల్-14వ సీజన్ రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటమి పాలైన తరువాత ఆ జట్టు సారధి ధోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఢిల్లీ ముందు సాధ్యమైనంత భారీ లక్ష్యాన్ని ఉంచాలని భావించామని, అయితే, ఆ లక్ష్యం వారికి సునాయాసమైందని అన్నారు. మ్యాచ్ తరువాత జరిగిన ప్రజంటేషన్ కార్యక్రమంలో, ఓటమిపై ధోనీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసే జట్టు ఆరంభంలో కష్టపడాల్సి వస్తుందని తనకు ముందుగానే తెలుసునని, తొలి ఓవర్లలోనే కీలక వికెట్లు కోల్పోవడం తమను నష్టపరిచిందని అన్నారు. తేమ కారణంగా మ్యాచ్ ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలిందని, ఇటువంటి పిచ్ లు సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకే సహకరిస్తాయని, ఈ మ్యాచ్ లో టాస్ గెలవడమే ముఖ్యమని అన్నాడు.

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన సమయంలో తన మనసులో ఒకే ఆలోచన ఉందని, వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని భావిస్తూ, తొలి అరగంట నిలదొక్కుకోవాలని అనుకున్నామని, అయితే, అది జరగలేదని అన్నారు. మరో 20 పరుగుల వరకూ చేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ఓపెనర్లు అవుట్ అయిన తరువాత ఇతర ఆటగాళ్లు చాలా శ్రమించారని, వారి వల్లే 188 పరుగుల స్కోర్ ను చేయగలిగామని, అయితే అది చాల్లేదని పేర్కొన్నారు.  కాగా, ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు విధించిన లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సులువుగా అధిగమించిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ తమకు ఓ గుణపాఠాన్ని నేర్పిందని, బౌలర్లు సైతం తమ ఆటతీరును మరింతగా మెరగు పరచుకోవాల్సి వుందని తెలిపారు.