తప్పిపోయిన కూతురే కాబోయే కోడలు... పెళ్లింట వింత పరిస్థితి... కానీ క్లైమాక్స్ అదిరింది!

10-04-2021 Sat 20:22
  • చైనాలోని సుజౌ ప్రాంతంలో 20 ఏళ్ల కిందట కుమార్తెను దూరం చేసుకున్న తల్లి
  • ఆ పాపను పెంచుకున్న దంపతులు
  • ఇటీవల పెళ్లి నిశ్చయం
  • నాడు పాపను పోగొట్టుకున్న తల్లి ఇంటికే కోడలిగా యువతి
  • చేతిపై పుట్టుమచ్చ చూసి గుర్తుపట్టిన యువతి
Cinematic incident in China

ఇది సినిమా కథ కాదు... కానీ అంతకుమించి ట్విస్టులతో సినిమా కథకు ఏమాత్రం తీసిపోని నిజ జీవిత గాథ. ఎప్పుడో 20 ఏళ్ల కిందట తప్పిపోయిన కుమార్తె మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కాబోయే కోడలి రూపంలో ఎదురైతే ఓ తల్లి ఎంతో సంకట స్థితికి గురైంది. అయితే చివర్లో సినిమా క్లైమాక్స్ కు దీటుగా జరిగిన పరిణామంతో కథ సుఖాంతం అయింది.

అసలే జరిగిందంటే... చైనాలో సుజౌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ 20 ఏళ్ల కిందట కన్నబిడ్డను దూరం చేసుకుంది. రోడ్డు పక్కన దొరికిన ఆ పాపను మరో దంపతులు పెంచి పెద్దచేశారు. ఇప్పుడా అమ్మాయి యుక్త వయసుకు రాగా, ఆ పెంచిన తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి పెళ్లి నిశ్చయం చేశారు. 20 ఏళ్ల కిందట ఆ అమ్మాయిని దూరం చేసుకున్న మహిళ ఇంటికే ఆమె కోడలిగా రాబోతోంది. అప్పటికి ఆ విషయం ఎవరికీ తెలియదు.

ఇక పెళ్లిరోజున ఆసక్తికర పరిణామం జరిగింది. తన కాబోయే కోడలి చేతిపై ఉన్న పుట్టుమచ్చను చూసి ఆ మహిళ ఎంతో ఆశ్చర్యానికి గురైంది. చిన్నతనంలో తప్పిపోయిన తన కుమార్తె చేతిపైనా అలాంటి పుట్టుమచ్చే ఉంటుందన్న విషయం ఆమెకు జ్ఞప్తికి వచ్చింది. దాంతో ఆ యువతి తల్లిదండ్రులను గట్టిగా ప్రశ్నిస్తే వాళ్లు నిజం చెప్పేశారు. చాన్నాళ్ల కిందట పాప దొరికితే పెంచుకున్నామని వెల్లడించారు. అంతవరకు ఓకే!

కానీ ఇప్పుడే అసలు సమస్య వచ్చింది. తన అసలు తల్లి ఎవరో తెలిసిన ఆనందంలో ఉన్న ఆ యువతి... సోదరుడ్ని పెళ్లి చేసుకోవడమా? అనే డైలమాలో పడింది. అయితే ఆమె తల్లి అదిరిపోయే రేంజిలోఓ రహస్యాన్ని వెల్లడించింది. ఆ యువకుడు తన కన్నబిడ్డ కాదని, తాను పెంచుకున్న అబ్బాయి అని తెలిపింది. కుమార్తె దూరం కావడంతో ఆ అబ్బాయిని దత్తత చేసుకున్నానని వివరించింది. దాంతో వాళ్లిద్దరూ తోబుట్టువులు కాదని తేలిపోవడంతో పెళ్లి సజావుగా జరిగింది.