చరణ్ తో సినిమా పుకారేనన్నమాట!

10-04-2021 Sat 19:20
  • 'జెర్సీ' సినిమాతో మంచి క్రేజ్
  • హిందీలోను రీమేక్
  • ప్రస్తుతం కథలపైనే కసరత్తు  
Charan movie with Gowtham Thinnanuri is a rumour

గౌతమ్ తిన్ననూరి పేరు వినగానే నాని కథానాయకుడిగా తెరకెక్కిన 'జెర్సీ' సినిమా గుర్తుకువస్తుంది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా, భారీ విజయాన్ని సాధించింది. నాని కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. దాంతో ఈ యువ దర్శకుడితో సినిమాలు చేయడానికి యంగ్ స్టార్ హీరోలంతా ఉత్సాహాన్ని చూపించారు. కానీ ఆయన ఇదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేశాడు. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు 'జెర్సీ' ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయస్థాయిలో అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆల్రెడీ కథ వినిపించడం .. చరణ్ ఓకే చెప్పేయడం కూడా జరిగిపోయిందనే ప్రచారం జరిగింది. అయితే, ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని తెలుస్తోంది. తాజా ఇంటర్వ్యూలో గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ,  హిందీ 'జెర్సీ' నవంబర్ లో రిలీజ్ కానున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం తాను కథలు రెడీ చేసుకుంటున్నాననీ, కథను బట్టి హీరోలను కలుస్తానని అన్నాడు. ఇంతవరకూ ఏ హీరోను కలవలేదనీ .. ఎవరికీ కథ చెప్పలేదనే విషయాన్ని స్పష్టం చేశాడు. ఆయన దర్శకత్వంలో చరణ్ సినిమా ఉందనే ప్రచారం పుకారిస్టుల పనేనన్నమాట.