రజనీ .. కమల్ ఇద్దరి టార్గెట్ దీపావళినే!

10-04-2021 Sat 18:44
  • రజనీకాంత్ హీరోగా 'అన్నాత్తే'
  • కమల్ కథనాయకుడిగా 'విక్రమ్'
  • ఆందరిలో పెరుగుతోన్న ఆసక్తి    
Rajanikanth and kamal Haasan movies will be released at Deepavali

రజనీకాంత్ .. కమలహాసన్ .. కోలీవుడ్ సినిమా పరిశ్రమకి రెండు కళ్లు. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. కెరియర్ పరంగా చూసుకుంటే ఆరోగ్యకరమైన పోటీ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వాళ్లు అదే స్నేహాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇద్దరూ సీనియర్ స్టార్ హీరోలు .. ఎవరి నటన వారిది .. ఎవరి క్రేజ్ వారిది. రజనీ కెరియర్లో స్టైల్ ప్రధానంగా కనిపిస్తే, కమల్ కెరియర్లో ప్రయోగాలు ప్రధానంగా కనిపిస్తాయి. అలాంటి ఈ ఇద్దరి సినిమాలు ఈ ఏడాది దీపావళికి రానున్నాయనే టాక్ ఇప్పుడు కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.


రజనీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు శివ 'అన్నాత్తే' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఉద్దేశంతో, క్రితం ఏడాది షూటింగును మొదలుపెట్టారు. కానీ లాక్ డౌన్ కారణంగా ప్లాన్ మారిపోయింది. ఇప్పటికే ఇంకా షూటింగే పూర్తి చేసుకోలేదు. ఈ దీపావళికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మాత్రం చెప్పారు. ఇక లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ 'విక్రమ్' సినిమా చేస్తున్నాడు. ఇది కమల్ సొంత సినిమా .. దీనిని దీపావళికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దాంతో ఈ రెండు సినిమాలు ఒకేసారి థియేటర్లలో దిగితే పరిస్థితి ఏమిటనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.