నైజామ్ లో 'వకీల్ సాబ్' ఫస్టు డే వసూళ్లు!

10-04-2021 Sat 17:19
  • ఈ నెల 9వ తేదిన విడుదలైన 'వకీల్ సాబ్'
  • ఓవర్సీస్ లోను భారీ వసూళ్లు
  • పవన్ పై ప్రశంసల వెల్లువ
Vakeel Saab first day nizam collectons

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన 'వకీల్ సాబ్' ... నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో హిట్ కొట్టిన 'పింక్' సినిమాకి రిమేక్ గా 'దిల్' రాజు ఈ సినిమాను నిర్మించారు. శ్రుతి హాసన్ ప్రత్యేకమైన పాత్రలో నటించిన ఈ సినిమాలో, నివేద థామస్ .. అంజలి .. అనన్య ముఖ్యమైన పాత్రలను పోషించారు. పవన్ కొంత గ్యాప్ తరువాత చేసిన సినిమా కావడం వలన, ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టడం ఖాయమనేది చాలా రోజులుగా వినిపిస్తోంది. అలా అనుకున్నట్టుగానే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

విడుదల రోజునే ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో హిట్ టాక్ తెచ్చుకుంది. నైజామ్ లో తొలిరోజున 8.7 కోట్ల షేర్ ను రాబట్టినట్టు చెబుతున్నారు. వీకెండ్ కి వసూళ్ల పరంగా నైజామ్ లో కొత్త రికార్డును నమోదు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఇక ఆంధ్రలోను వసూళ్ల పరంగా ఈ సినిమా దూసుకుపోతోంది. ఇక్కడే కాదు ఓవర్సీస్ లోను ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్మురేపేస్తోందని అంటున్నారు. ఇటు అభిమానులు మాత్రమే కాదు, అటు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా పవన్ ను ప్రశంసలతో ముంచెత్తుతూ ఉండటం విశేషం.