పోలీసుల దాడిలో పాల్వాయి హరీశ్ పక్కటెముకలు విరిగిపోయాయి: బండి సంజయ్

10-04-2021 Sat 17:13
  • కొమురం భీం జిల్లాలో పోడుభూముల కోసం ఆందోళన
  • స్థానికులకు మద్దతుగా బీజేపీ నేతల దీక్ష
  • అర్ధరాత్రి భగ్నం చేసిన పోలీసులు
  • తీవ్రంగా ఖండిస్తున్నానని బండి సంజయ్ వ్యాఖ్యలు
Bandi Sanjay said Palwai Harish ribs fractured in police attack

పోడు భూములకు పట్టాల కోసం కొమురం భీం జిల్లా పెంచికల్ పేట్ మండలం కొండపల్లిలో ప్రజలు ఆందోళన చేస్తుండగా, వారికి అండగా బీజేపీ నేత పాల్వాయి హరీశ్ దీక్షకు దిగారు. అయితే, పోలీసులు గత అర్ధరాత్రి ఈ దీక్షను భగ్నం చేశారని, పోలీసుల దాడిలో పాల్వాయి హరీశ్ పక్కటెముకలు విరిగిపోయాయని, మరో నేత సత్యనారాయణ సైతం తీవ్రంగా గాయపడ్డాడని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వెల్లడించారు.

పేద రైతుల కోసం బీజేపీ నేతల దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇది ప్రజాస్వామ్యమా...? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ సర్కారు పోలీసులతో దాడి చేయించిందని ఆరోపించారు. ఇది అరాచక రాజ్యంలా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.