విదేశాలకు కరోనా వ్యాక్సిన్లు ఎగుమతి చేస్తూ స్వదేశంలో కొరత సృష్టిస్తున్నారు: కేంద్రంపై సోనియా విమర్శలు

10-04-2021 Sat 16:37
  • కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో సోనియా సమావేశం
  • కేంద్రం తీరుపై అసంతృప్తి
  • వ్యాక్సిన్ కొరత ఏర్పడితే కేంద్రం ఏంచేస్తోందని వ్యాఖ్యలు
  • ఔషధాలు, వెంటిలేటర్లు అందుబాటులో ఉండడంలేదని  విమర్శ 
Sonia Gandhi slams Union Govt over corona shortage

కరోనా వ్యాక్సిన్ వినియోగం అందుబాటులోకి వచ్చాక ప్రపంచ దేశాలన్నింటికి భారత్ పెద్ద దిక్కుగా మారింది. అడిగినవారికి, అడగనివారికీ వ్యాక్సిన్ డోసులు ఎగుమతి చేస్తూ తన సౌహార్ద్రతను చాటుకుంటోంది. అయితే ఇప్పుడు దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత ఏర్పడితే కేంద్రం ఏం చేస్తోందంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ధ్వజమెత్తారు. దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో ఆమె వర్చువల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా పరీక్షలకు, వైరస్ బాధితుల గుర్తింపునకు, ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. కానీ మోదీ ప్రభుత్వం విదేశాలకు కరోనా వ్యాక్సిన్ ఎగుమతులపై దృష్టి సారించి, స్వదేశంలో వ్యాక్సిన్ కొరతకు కారణమవుతోందని విమర్శించారు. అంతేకాకుండా, కరోనా చికిత్సకు ఉపయోగించే ఔషధాలు, వెంటిలేటర్లు కూడా అందరికీ అందుబాటులో ఉండడం లేదని పేర్కొన్నారు.

కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో 45 ఏళ్లకు పైబడినవారికే కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాకాకుండా, అవసరమైన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని రాహుల్ పేర్కొన్నారు. అంతేకాదు, కరోనా వ్యాక్సిన్ల ఎగుమతిపై తక్షణమే అమల్లోకి వచ్చేలా తాత్కాలిక నిషేధం విధించాలని, ఇతర సంస్థల వ్యాక్సిన్లకు కూడా సత్వర అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.