ఈ నెల 15 నుంచి ఇందిరాపార్క్ వద్ద షర్మిల మూడు రోజుల‌ దీక్ష

10-04-2021 Sat 15:18
  • స్ప‌ష్ట‌త‌నిచ్చిన‌ ష‌ర్మిల‌ అనుచరులు
  • దీక్ష‌కు దిగుతాన‌ని ‌ఖ‌మ్మం స‌భ‌లోనూ ష‌ర్మిల‌ ప్ర‌కట‌న
  • ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోతే ఇత‌ర‌ జిల్లాల్లోనూ నిరాహార దీక్షలు  
sharmila protest for jobs

తెలంగాణ‌లో రాజ‌కీయ‌ పార్టీని ప్రారంభించ‌నున్న వైఎస్ ష‌ర్మిల ప్ర‌జ‌ల్లోకి త‌మ పార్టీని తీసుకెళ్లేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాడతాన‌ని, ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తాన‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసిన ఆమె నిరాహార దీక్ష‌కు సిద్ధ‌మ‌య్యారు.

ఈ నెల 15 నుంచి హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద షర్మిల దీక్ష చేస్తున్నట్లు ఆమె అనుచరులు ప్రకటించారు. ఇదే విష‌యాన్ని నిన్న కూడా ష‌ర్మిల ఖ‌మ్మం స‌భ‌లో ప్ర‌క‌టించారు. దీనిపైనే ఆమె అనుచ‌రులు ఈ రోజు స్ప‌ష్ట‌త నిచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.  

ఆమె దీక్ష చేసిన‌ప్ప‌టికీ సర్కారు స్పందించకుంటే ఇత‌ర‌ జిల్లాల్లోనూ నిరాహార దీక్షలు కొనసాగుతాయని ఆమె అనుచ‌రులు చెప్పారు. తెలంగాణ‌లో లక్షా 91 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేషన్ల‌ను ఇచ్చే వ‌ర‌కు నిరుద్యోగుల త‌ర‌ఫున పోరాటం కొన‌సాగుతుంద‌ని చెప్పారు.