బెంగళూరులో తాను చూసిన ఆసక్తికర దృశ్యాన్ని పంచుకున్న వీవీఎస్ లక్ష్మణ్

10-04-2021 Sat 14:32
  • బెంగళూరు వృద్ధురాలి హైటెక్ ఆలోచన
  • సౌరశక్తి సాయంతో మొక్కజొన్న కండెలు కాల్చుతున్న వైనం
  • విసనకర్ర బదులు సోలార్ ఫ్యాన్
  • అద్భుతంగా ఉందన్న లక్ష్మణ్
VVS Laxman shares what he saw on Bengaluru roadside

హైదరాబాద్ బ్యాటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ రిటైర్మెంట్ తర్వాత వ్యాఖ్యాతగా మారి అలరిస్తున్నారు. ఆయన సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా వ్యవహరిస్తుంటారు. తన పర్యటనల్లో గమనించిన కొత్త విషయాలను తప్పనిసరిగా అభిమానులతో పంచుకుంటారు. ఇటీవల బెంగళూరులో చూసిన ఓ దృశ్యాన్ని కెమెరాలో బంధించిన లక్ష్మణ్ ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

సెల్వమ్మ అనే వృద్ధురాలు తోపుడు బండిపై సోలార్ ప్యానెల్ సాయంతో మొక్కజొన్న కండెలు కాల్చుతున్న దృశ్యాన్ని ఫొటోలో చూడొచ్చు. సాధారణంగా మొక్కజొన్న కండెలు కాల్చేటప్పుడు విసనకర్ర ఉపయోగిస్తుంటారు. కానీ సెల్వమ్మ సోలార్ ఫ్యాన్ ఉపయోగిస్తోంది.

దీనిపై లక్ష్మణ్ స్పందిస్తూ... "బెంగళూరులో రోడ్డు పక్కన 75 ఏళ్ల సెల్వమ్మ మొక్కజొన్న కండెలను కాల్చేందుకు హైటెక్ సోలార్ పవర్ ఫ్యాన్ ఉపయోగించడం అద్భుతంగా అనిపించింది. ఆ సోలార్ ప్యానెల్ సాయంతో ఓ లైటు, చిన్న ఫ్యాను పనిచేస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు విస్తృతస్థాయిలో ప్రజాసంక్షేమానికి ఉపయోగపడుతుండడం ఆనందం కలిగిస్తోంది" అని పేర్కొన్నారు.