Bandi Sanjay: కరీంనగర్, వరంగల్ రహదారిపై జనం పడుతున్న కష్టాలకు చెక్ పడనుంది: బండి సంజ‌య్‌

  • 4 లైన్ల నేషనల్ హైవే విస్తరణ ప్రక్రియ వేగవంతం
  • 26.69 హెక్టార్ల‌ భూ సేకరణకు కేంద్రం గెజిట్ విడుదల  
  • భారత్ మాలా ఫేజ్ 1 లో చేర్చిన కేంద్రం 
  • 67 కి.మీ రహదారి 4 లైన్ల విస్తరణకు నోటిఫికేషన్ 
bandi sanjay on centre notification

నేషనల్ హైవే విస్తరణ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని దీని వ‌ల్ల తెలంగాణ‌లోని ప‌లు మార్గాల్లో ట్రాఫిక్ క‌ష్టాలు తీరనున్నాయ‌ని బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తెలియజేశారు.

'ఇక కరీంనగర్, వరంగల్ రహదారిపై జనం పడుతున్న కష్టాలకు చెక్ పడనుంది. ఈ రహదారి 4 లైన్ల నేషనల్ హైవే విస్తరణ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. తాజాగా కేంద్ర రోడ్డు, రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 26.69 హెక్టార్ల‌ భూ సేకరణకు గురువారం గెజిట్ విడుదల చేసింది' అని బండి సంజ‌య్ వివ‌రించారు.

'నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిని 4 లైన్లుగా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం “భారత్ మాలా ఫేజ్ 1” లో చేర్చింది. మొత్తం 67 కి.మీ రహదారిని 4 లైన్ల విస్తరణకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికోసం మొత్తం 305.47 హెక్టార్ల భూసేకరణ అవసరం ఉంది. ఇందులో 47.14 హెక్టార్ల భూమి ఇప్పటికే అందుబాటులో ఉండగా, ఇంకా 258.33 హెక్టార్ల సేకరణ ప్రక్రియ కొనసాగిన తరుణంలో 167.14 హెక్టార్ల భూ సేకరణ ప్రక్రియ పూర్తి అయ్యి గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది' అని బండి సంజ‌య్ పేర్కొన్నారు.  

'ఇక మిగిలిన 91.19 హెక్టార్లలో గురువారం 26.69 హెక్టార్ల భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మిగిలిన 64.5 హెక్టార్ల భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లు త్వరలోనే వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. భూసేకరణ ప్రక్రియ పూర్తికాగానే అతి త్వరలో 4 లైన్ల విస్తరణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను' అని బండి సంజ‌య్ తెలిపారు.

More Telugu News