Mumbai: లంచం సొమ్మును కిందపడేసి, పరుగందుకున్న ఐటీ అధికారి.. వెంబడించి పట్టుకున్న సీబీఐ అధికారి

  • ముంబైలోని గోరెగావ్‌లో ఘటన
  • ఐటీ దాడుల నుంచి బయటపడేస్తామంటూ లంచం డిమాండ్
  • లంచం తీసుకుంటూ దొరికిన ఐటీ ఇన్‌స్పెక్టర్
  • బ్యాగు పడేసి పరుగో పరుగు
Mumbai Tax Inspector Drops Rs 5 Lakh Bribe

ఓ వ్యక్తి నుంచి రూ. 5 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో సీబీఐ అధికారులు చుట్టుముట్టడంతో ఆ డబ్బును రోడ్డుపై పడేసి పరుగందుకున్నాడో ఐటీ అధికారి. అప్రమత్తమైన సీబీఐ అధికారి ఒకరు ఆయనను వెంబడించారు. అలా కిలోమీటరు దూరం పరుగెత్తి ఎట్టకేలకు అతడిని పట్టుకున్నాడు. ముంబైలోని గోరెగావ్‌లో సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

సీబీఐ కథనం ప్రకారం.. పన్ను ఎగవేతకు పాల్పడిన ఓ వ్యక్తిని ఐటీ దాడుల నుంచి బయట పడేస్తామంటూ బల్లార్డ్ పీర్ కార్యాలయంలో ఐటీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆశిష్ కుమార్, మరో ఇద్దరు అధికారులు వేర్వేరుగా లంచం డిమాండ్ చేశారు. ఆ విషయాన్ని బాధితుడు సీబీఐ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారు చెప్పినట్టుగా రూ. 5 లక్షలను రాత్రివేళ ఐటీ ఇన్‌స్పెక్టర్ ఆశిష్‌‌కు అందించాడు. అతడు దానిని జాగ్రత్తగా బ్యాగులో పెట్టుకున్నాడు.

అప్పటికే వల పన్నిన సీబీఐ అధికారులు ఆశిష్‌ను చుట్టుముట్టారు. గమనించిన ఆశిష్ ఆ బ్యాగును రోడ్డుపై పడేసి పరుగు లంకించుకున్నాడు. క్షణాల్లోనే అప్రమత్తమైన సీబీఐ అధికారి వినీత్ జైన్ అతడిని వెంబడించాడు. కిలోమీటరుకుపైగా దూరం పరుగెత్తి ఎట్టకేలకు ఆశిష్‌ను పట్టుకుని కస్టడీలోకి తీసుకున్నాడు.

ఇదే వ్యవహారంలో రూ. 10 లక్షలు డిమాండ్ చేసిన మరో ఇద్దరు ఐటీ ఇన్‌స్పెక్టర్లు దిలీప్‌కుమార్, ఎస్.ఎస్. రాయ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News