Prince Harry: తాతయ్య చివరి చూపుకైనా మనవడు వస్తాడా? రాడా?... బ్రిటన్ లో ఇప్పుడు ఇదే చర్చ!

  • శుక్రవారం కన్నుమూసిన ప్రిన్స్ ఫిలిప్
  • ప్రస్తుతం యూఎస్ లో ఉన్న హ్యారీ దంపతులు
  • వస్తే ప్రజలు తూలనాడే అవకాశం
  • హ్యారీ రాకపై వీడని సందిగ్ధత
Is Harry and Merkel Come for Prince Funeral

శుక్రవారం ఉదయం మరణించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్ భర్త, డ్యూక్ ఆఫ్ ఎడిన్ బర్గ్  ప్రిన్స్ ఫిలిప్ ను కడసారి చూసేందుకైనా ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మెర్కెల్ లు లండన్ కు వస్తారా? బ్రిటన్ లో ఇప్పుడు ఇదే పెద్ద చర్చ.

రాచరికాన్ని వదిలేసుకుని వెళ్లిపోయిన హ్యారీ, మేఘన్ దంపతులు ప్రస్తుతం అమెరికాలో వుంటున్నారు. ఫిలిప్ ను ప్రాణాలతో చివరి సారి చూసేందుకు రావాలని రాజకుటుంబం ప్రతినిధులు గత నెలలో హ్యారీని కోరినా, ఆయన రాలేదు. ఫిలిప్ ఆరోగ్యం బాగాలేదని, తాతయ్యను చూసేందుకు ఓ మారు రావాలని బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి హ్యారీ దంపతులకు సందేశం వెళ్లినా వారు స్పందించలేదు.

ఇక ఇప్పుడు ఫిలిప్ కన్నుమూయడంతో, ఆయన అంత్యక్రియలకైనా వీరిద్దరూ వస్తారా? అన్న విషయమై ఇంకా సందిగ్ధత వీడలేదు. ప్రిన్స్ ఫిలిప్ ఎప్పుడైనా కన్నుమూయవచ్చని బ్రిటన్ వాసులందరికీ ముందే తెలుసు. ఇదే విషయాన్ని దాదాపు రెండు నెలల క్రితమే ప్రస్తావించిన ఓ పత్రిక, ఒకవేళ ఆయన మరణించి, అంత్యక్రియలకు హ్యారీ దంపతులు హాజరైతే ప్రజలు బహిరంగంగానే తూలనాడవచ్చని, వారిద్దరినీ ఎక్కడ కూర్చోబెట్టాలన్న విషయంపైనా ప్యాలెస్ వర్గాలు ఎన్నో అంశాలను పరిశీలించాల్సి వుంటుందని ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఇక ఫిలిప్ మరణ వార్తను విన్న తరవాత హ్యారీ, మేఘన్ లు నిర్వహిస్తున్న ఆర్చ్ వెల్ ఫౌండేషన్ నివాళులు అర్పిస్తూ, తమ అధికారిక వెబ్ సైట్ లో ఒకే ఒక్క వాక్యాన్ని పెట్టడం కూడా చర్చనీయాంశమైంది. "రాయల్ హైనెస్, ది డ్యూక్ ఆఫ్ ఎడిన్ బర్గ్ 1921-2021... మీ మధుర జ్ఞాపకాల్లో...మీ సేవలకు సర్వదా కృతజ్ఞులం. మీరు లేని లోటు తీర్చలేనిది" అని పేర్కొన్నారు. బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం పాటు సేవ చేసిన రాజకుటుంబ వ్యక్తిగా చరిత్ర సృష్టించిన ఫిలిప్, విండ్ సర్ ప్లాజాలో చాలా ప్రశాంతంగా కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయన్న విషయమై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.

More Telugu News