వకీల్ సాబ్ విడుదలతో పవన్ కే సంబంధం లేనప్పుడు దేవధర్ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నట్టు?: పేర్ని నాని

09-04-2021 Fri 19:37
  • ఏపీలో వకీల్ సాబ్ వివాదం
  • బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరణ
  • బీజేపీ నేతల ఆగ్రహం
  • దేవధర్ కు సినిమాలతో ఏంపని అంటూ నాని వ్యాఖ్యలు
Perni Nani attends a debate on Vakeel Saab row

వకీల్ సాబ్ చిత్రానికి ఏపీలో బెనిఫిట్ షోలు నిరాకరించడం రాజకీయ రంగు పులుముకుంది. ఓ చానల్లో ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో ఏపీ మంత్రి పేర్ని నాని, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ, బీజేపీ నేత సునీల్ దేవధర్ హుందాగా నడుచుకోవాలని హితవు పలికారు. సినిమా వ్యవహారాలతో ఏం పని? అని ప్రశ్నించారు. కరోనా తర్వాత ఏ సినిమాకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.

అయినా వకీల్ సాబ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ లతో తమకు ఎలాంటి గొడవలు లేవని అన్నారు. ఈ సినిమాకు రూ.50 కోట్లు తీసుకుని పవన్ వెళ్లిపోయాడని, ఇక పవన్ కల్యాణ్ కు ఈ సినిమా విడుదలకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు సునీల్ దేవధర్ ఈ సినిమాపై ఎందుకింత రగడ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీల్ దేవధర్ ఓట్లు అడగడానికి తిరుపతి వచ్చారా?, లేక సినిమా కోసం వచ్చారా? అని నిలదీశారు.

అంతకుముందు, ఇదే అంశంపై వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వకీల్ సాబ్ సినిమాలో పెద్దగా విషయం లేదని, అందుకే గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ సినిమాకు టికెట్లు కొనేవాళ్లే లేరని అన్నారు.