బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ అస్తమయం

09-04-2021 Fri 17:02
  • బ్రిటన్ రాజకుటుంబంలో విషాదం
  • ఈ ఉదయం కన్నుమూసిన ప్రిన్స్ ఫిలిప్
  • ప్రిన్స్ ఫిలిప్ వయసు 99 సంవత్సరాలు
  • ఇటీవల ఇన్ఫెక్షన్ కు గురైన ప్రిన్స్ ఫిలిప్
Prince Philip died at the age of ninety nine years
బ్రిటన్ రాజకుటుంబంలో విషాదం నెలకొంది. క్వీన్ ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ (డ్యూక్ ఆప్ ఎడింబర్గ్) కన్నుమూశారు. ప్రిన్స్ ఫిలిప్ వయసు 99 సంవత్సరాలు. ఈ ఉదయం విండ్సర్ క్యాజిల్ లో ఆయన తుదిశ్వాస విడిచినట్టు బకింగ్ హ్యామ్ ప్యాలెస్ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి.

భర్త మృతి పట్ల క్వీన్ ఎలిజబెత్-2 తీవ్ర విషాదానికి లోనయ్యారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషాదం పట్ల రాజకుటుంబీకులు తమ సంతాపం తెలియజేస్తున్నారని వివరించారు. ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలకు సంబంధించి మరో ప్రకటన చేస్తామని బకింగ్ హ్యామ్ ప్యాలెస్ వర్గాలు తెలిపాయి.

ఇటీవల ప్రిన్స్ ఫిలిప్ ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. ఫిబ్రవరి 16న లండన్ లోని కింగ్ ఎడ్వర్డ్-7 ఆసుపత్రిలో చేర్చినా, మెరుగైన వైద్య చికిత్స కోసం ఓ కార్డియాక్ కేర్ ఆసుపత్రికి తరలించారు. మరలా కొన్నిరోజులకే కింగ్ ఎడ్వర్డ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రిన్స్ ఫిలిప్ ను మార్చి 16న డిశ్చార్జి చేశారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం కన్నుమూశారు.