'వ‌రుడు కావలెను' అంటూ 73 ఏళ్ల బామ్మ ప్ర‌క‌ట‌నకు ముందుకు వ‌చ్చిన 69 ఏళ్ల తాత‌

09-04-2021 Fri 13:08
  • క‌ర్ణాట‌కలో ఘ‌ట‌న‌
  • బామ్మ‌కు ఫోన్ చేసిన తాత‌
  • ఫోనులో మ‌న‌సు విప్పి మాట్లాడుకున్న వృద్ధులు
  • వారి పిల్ల‌ల స‌మ‌క్షంలో త్వ‌ర‌లో పెళ్లి
eldery couple to get married

'వ‌రుడు కావలెను' అంటూ 73 ఏళ్ల ఓ బామ్మ, ఆమె కుటుంబ స‌భ్యులు ఇటీవల ఓ పేపర్ ప్ర‌క‌ట‌న ఇచ్చారు. ఈ ప్ర‌క‌ట‌న చూసిన ఓ 69 ఏళ్ల తాత ముందుకు వ‌చ్చి ఆమెను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పారు. బామ్మ‌కు ఫోను చేసి క‌బుర్లు చెప్పారు. ఫోనులోనే వారిద్ద‌రు మ‌న‌సు విప్పి మాట్లాడుకుని ప్రేమ‌లో పడ్డారు. వారి పిల్ల‌ల స‌మ‌క్షంలో త్వ‌ర‌లోనే వారిద్ద‌రి పెళ్లి జ‌ర‌గ‌నుంది.

క‌ర్ణాట‌క‌లోని మైసూరు నగరంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఓ ఉపాధ్యాయురాలు త‌న భ‌ర్త‌తో విభేదాలు రావ‌డంతో కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. జీవితంలో ఆమెకు ఓ తోడు అవసరమని ఆమె కుటుంబ సభ్యులు  ఆమెను పెళ్లికి ఒప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రిపారు.

చివ‌ర‌కు ఆమె ఓకే చెప్పింది. తర్వాత 'వరుడు కావలెను' అంటూ ప్రకటన ఇవ్వ‌డంతో 69 ఏళ్ల విశ్రాంత ఇంజనీర్‌ ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారు. త‌న భార్య ఏడేళ్ల క్రిత‌మే మృతి చెందింద‌ని ఆయన చెప్పారు. ఇరు కుటుంబాల్లో వారి పిల్ల‌లు ఈ పెళ్లికి ఒప్పుకోవ‌డంతో.. త్వరలోనే బామ్మగారి మెడలో తాతగారు మూడుముళ్లూ వేయడానికి కొత్తపెళ్లికొడుకులా రెడీ అయిపోతున్నారు.