మ్యాగ్జిమమ్ వన్ ఇయర్.. హిడ్మా కథ ముగిస్తాం: సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ధీమా

09-04-2021 Fri 11:58
  • నక్సల్స్ పరిధి 20 కిలోమీటర్లకు కుచించుకుపోయింది
  • వారిప్పుడు అష్టదిగ్బంధనంలో ఉన్నారు
  • తప్పించుకోవడమో, తనువు చాలించడమో.. వారి ఎదుట రెండే మార్గాలు
  • హెచ్చరించిన కుల్దీప్ సింగ్
Naxal Hidma History will Close in Maximum one year

నక్సల్ కమాండర్ హిడ్మా కథను ఏడాదిలో ముగిస్తామని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ అన్నారు. నక్సల్స్‌పై పోరును మరింత ఉద్ధృతం చేస్తామని, ఏడాదిలోగా హిడ్మా చరిత్రలో కలిసిపోవడం పక్కా అని అన్నారు. గతంలో 100 కిలోమీటర్లుగా ఉన్న నక్సల్స్ పరిధి ఇప్పుడు 20 కిలోమీటర్లకు తగ్గిపోయిందన్నారు. ఇక వారు తప్పించుకోవడం అసాధ్యమని తేల్చిచెప్పారు.

నక్సల్స్ ప్రస్తుతం తమ అష్టదిగ్బంధనంలో ఉన్నారని, వారి ఎదుట ఇప్పుడు రెండే మార్గాలు ఉన్నాయని అందులో ఒకటి పారిపోవడం కాగా, రెండోది అంతం కావడమేనని పేర్కొన్నారు. వారు తలదాచుకుంటున్న ప్రాంతాలను గుర్తించి బయటకు తీసుకొస్తామని, ఏడాదిలోపు వారి కథ ముగిసిపోతుందని వివరించారు.

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) కమాండర్‌గా ఉన్న హిడ్మా పన్నిన వ్యూహంలో బలగాలు చిక్కుకున్నాయన్న వాదనను కుల్దీప్ సింగ్ తోసిపుచ్చారు. అదే జరిగి ఉంటే మరిన్ని మరణాలు సంభవించి ఉండేవన్నారు. ఎన్‌కౌంటర్‌లో నక్సల్స్ వైపు నుంచి పెద్ద నష్టమే జరగిందని, చనిపోయిన వారిని తరలించేందుకు  నక్సల్స్  నాలుగు ట్రాక్టర్లను వినియోగించారన్నారు. నక్సల్స్ దాడిలో 22 మంది జవాన్లు అమరులు కావడం బాధాకరమని కుల్దీప్ అన్నారు.