'ఖిలాడి' టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

09-04-2021 Fri 11:47
  • 'క్రాక్'తో భారీ హిట్ కొట్టిన రవితేజ
  • షూటింగు దశలో ఉన్న 'ఖిలాడి'
  • లైన్లో మరో మూడు ప్రాజెక్టులు
Khiladi teaser wiil be released on Ugadi

రవితేజను పట్టుకోవడం .. ఆయన స్పీడ్ ను తట్టుకోవడం కష్టంగానే ఉంది. అసలే రవితేజలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ .. దానికి 'క్రాక్' సక్సెస్ తోడు కావడంతో ఆయన దూకుడు దుమ్మురేపేస్తోంది.

'క్రాక్' తరువాత ప్రాజెక్టుగా ఆయన పట్టాలెక్కించిన 'ఖిలాడి' సినిమా, చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. 'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీన ఉదయం 10:08 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ, ఈ సినిమా టీమ్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది.

'ఖిలాడి' సినిమాకి రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ ఎనర్జీ .. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథతో ఆయన ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాలో, రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఆయన సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి అలరించనున్నారు.

అలాగే, యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, మే 28న విడుదల చేయనున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే రవితేజ మరో మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టేయడం విశేషం.