బెంగళూరులో అర్ధరాత్రి ఒకే ఇంట్లో జంట హత్యలు

09-04-2021 Fri 11:32
  • 25 రోజుల క్రితమే బెంగళూరు వచ్చిన వ్యక్తి కూడా హత్య
  • ఇంట్లోని నగదు, నగలు, ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లిన దుండగులు
  • విదేశాల్లో ఉంటున్న బాధితురాలి కుమార్తె
Double murders in Bengaluru

బెంగళూరులో అర్ధరాత్రి వేళ ఒకే ఇంట్లో జరిగిన జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. స్థానిక జేపీ నగర్‌లోని ఓ ఇంట్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన 71 ఏళ్ల మమతా బసు ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె కుమార్తె విదేశాల్లో ఉంటున్నారు. లెక్చరర్ అయిన మమత కుమారుడు దేవదీపబసు పక్క వీధిలో ఉంటున్నారు.

ఈ క్రమంలో 25 రోజుల క్రితం మమత కుటుంబ స్నేహితుడైన ఒడిశాకు చెందిన దేవరథ్ బెహరా (41) బెంగళూరు వచ్చి వారి ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా చేస్తున్నారు. మొన్న అర్ధరాత్రి దాటిన తర్వాత మమత ఇంట్లోకి చొరబడిన దుండగులు తొలి అంతస్తులో నిద్రిస్తున్న వృద్ధురాలిని కత్తితో పొడిచి చంపారు. ఆ తర్వాత కిందికి వచ్చి దేవరథ్‌ను హత్య చేశారు.

అనంతరం ఇంట్లోని నగలు, నగదు, ల్యాప్‌టాప్ తీసుకుని వెళ్లిపోయారు. ఉదయం ఇంటికి వచ్చిన పనిమనిషి రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను చూసి మమత కుమారుడికి సమాచారం అందించింది. ఆయన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.