'వకీల్ సాబ్' హంగామా... సంబరాలలో పవర్ స్టార్ అభిమానులు!

09-04-2021 Fri 09:33
  • నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చిత్రం
  • ఏపీలో ఆగిన ప్రీమియర్ షోలు
  • హైదరాబాద్ మల్టీప్లెక్స్ ల్లో ఫుల్ షోలు
Release of Vakeel Saab Movie and Fans Report

గత సంవత్సరం కరోనా కారణంగా సినిమాల విడుదల ఆగిన తరువాత, ఓ టాలీవుడ్ స్టార్ హీరో చిత్రం నేడు తొలిసారిగా వెండితెరపై విడుదలైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం 'వకీల్ సాబ్' ఈ ఉదయం రిలీజ్ కాగా, ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఈ చిత్రం ప్రీమియర్ షోలు ఆంధ్రప్రదేశ్ లో రద్దయినా, తెలంగాణలోని కొన్ని థియేటర్లలో చిత్ర తొలి షో పూర్తయింది. ఈ సినిమా చూసిన ఫ్యాన్స్, ఇది సూపర్ హిట్ అని, కనీసం రూ. 100 కోట్ల కలెక్షన్ ఖాయమని అంటున్నారు.

ఇప్పటికే సినిమా టీజర్ తో పాటు విడుదల చేసిన పాటలు, ప్రమోషనల్ వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో అమితాబ్ ప్రధాన పాత్రలో రూపొందిన పింక్ చిత్రానికి రీమేక్ గా వకీల్ సాబ్ రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పవన్ అభిమానులను నిరాశ పరచబోదని, కథనం కొంత నిదానంగా ఉన్నా, కథ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉందని అంటున్నారు.

పవర్ స్టార్ లోని అసలైన నటుడిని ఈ చిత్రం పరిచయం చేసిందని, ఎమోషనల్ సీన్లలో ఆయన నటన అద్భుతమని కితాబులు వస్తున్నాయి. సమాజానికి ఓ సందేశాన్ని ఇచ్చేలా సినిమా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. పలు విదేశాల్లో ఇప్పటికే సినిమా షోలు పడగా, చూసిన వారంతా పాజిటివ్ గా స్పందిస్తూ, సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

కాగా, నేడు హైదరాబాద్ లోని ప్రధాన మల్టీప్లెక్స్ లలోని అన్ని స్క్రీన్లలో వకీల్ సాబ్ చిత్రమే ప్రదర్శిస్తుండటం గమనార్హం. ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లోని ఆరు థియేటర్లలో 22 షోలను వేస్తుండగా, పీవీఆర్ సోమాజిగూడలో 24 షోలు ప్రదర్శితం కానున్నాయి. ఇక జీవీకే ఐనాక్స్ లో 28 షోలు, పీవీఆర్ పంజాగుట్టలో 25 షోలు ప్రదర్శించేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాట్లు చేశారు.

ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో టికెట్లు విక్రయించిన తరువాత ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్టు థియేటర్ యాజమాన్యాలు ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆందోళనలు చేశారు. దీంతో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని థియేటర్లలో ఫ్యాన్స్ బలవంతంగా థియేటర్లలోనికి వెళ్లి కుర్చీలను విరగ్గొట్టి, అద్దాలను పగలగొట్టి, విధ్వంసానికి దిగినట్టు వార్తలు వస్తున్నాయి.