Corona Virus: ఢిల్లీలో కలకలం... సర్ గంగారామ్ ఆసుపత్రిలో 37 మంది డాక్టర్లకు కరోనా!

  • ఐదుగురిలో తీవ్ర లక్షణాలు
  • అత్యధికులు వ్యాక్సిన్ తీసుకున్న వారే
  • గత ఏడాదిగా కరోనా రోగులకు చికిత్స
  • ఢిల్లీలో ఆల్ టైమ్ రికార్డుకు కొత్త కేసులు
37 Doctors Gets Corona in New Delhi Sir Ganga Ram Hospital

దేశ రాజధానిలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో 37 మంది డాక్టర్లకు ఒకేసారి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడం తీవ్ర కలకలం రేపింది. ఇండియాలో ఇప్పటికే కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండగా, వైద్యులకు కూడా మహమ్మారి సోకడం, అందులో ఐదుగురికి తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడి చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరడంతో అధికార వర్గాలు అప్రమత్తం అయ్యాయి. గడచిన కొన్ని వారాలుగా ఢిల్లీ పరిధిలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజువారీ కేసులు ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో 7 వేల మార్క్ ను తొలిసారి దాటేశాయి.

కాగా, గత కొన్ని రోజులుగా ఆసుపత్రులకు వస్తున్న కరోనా రోగుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో బెడ్లు నిండుకున్నాయి. వీరిలో పలువురు హెల్త్ కేర్ వర్కర్లు కూడా ఉన్నారని అధికారులు అంటున్నారు. ఇక సర్ గంగారామ్ ఆసుపత్రిలో కరోనా బారిన పడిన వైద్యుల్లో చాలా మంది యువకులేనని, వారిలో అత్యధికులు వ్యాక్సిన్ తీసుకున్నారని ఉన్నతాధికారులు వివరించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ కరోనా రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా వారు ఎవరెవరిని కలిశారన్న విషయమై విచారణ ప్రారంభించామని, కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తూ, వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ వైద్యుల్లోని చాలా మందిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ 37 మందిలో 32 మంది ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారని, మిగతావారికి మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోందని అధికారులు తెలిపారు. దాదాపు ఏడాదిగా వీరంతా కరోనా సోకిన వారితోనే గడుపుతూ వచ్చారని వెల్లడించారు.

గురువారం నాడు ఢిల్లీలో 7,437 కొత్త కేసులు వచ్చాయి. ఇప్పటివరకూ ఢిల్లీ పరిధిలో కరోనా కారణంగా 11,157 మంది మరణించారని నగర వైద్యాధికారులు వెల్లడించారు. ఇండియాలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఉందన్న సంగతి తెలిసిందే.

More Telugu News