మమతపై పోటీకి దిగిన సువేందు అధికారికి ఈసీ నోటీసులు

08-04-2021 Thu 22:22
  • నందిగ్రామ్‌లో దీదీపై సువేందు పోటీ
  • ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు
  • ఈసీకి ఫిర్యాదు చేసిన సీపీఐ-ఎంఎల్‌ నేత
  • 24 గంటల్లో స్పందించాలని ఈసీ ఆదేశాలు
Suvendhu gets EC notice for hate speech

అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పోటీకి దిగిన బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఎన్నికల సంఘం(ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల ఓ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయంటూ అందిన ఫిర్యాదు మేరకు ఆయనకు నోటీసులు పంపినట్లు అధికారులు తెలిపారు. దీనిపై 24 గంటల్లోగా స్పందించాలని ఈసీ సువేందును ఆదేశించింది.  

ప్రచారంలో భాగంగా ఇతర పార్టీలపై నిరాధార ఆరోపణలు చేయొద్దని.. మతం, కులం ఆధారంగా ఓట్లు అడగొద్దని ఈసీ మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లో ఉంది. అయితే, ఈ నిబంధనల్లోని కొన్ని క్లాజ్‌లను గత నెల 29న నందిగ్రామ్‌లో చేసిన ప్రసంగంలో సువేందు ఉల్లంఘించారని సీపీఐ-ఎంఎల్‌ నేత కవితా కృష్ణన్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీకి పోటీగా బీజేపీ సువేందు అధికారిని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఒకప్పుడు తృణమూల్‌లో దీదీకి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆయన.. పార్టీ మారి ఆమెపైనే పోటీ చేయడం సర్వత్రా ఉత్కంఠకు తెరతీసింది. ఎవరు గెలవనున్నారనే దానిపై యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.