విమానంలో బట్టలు విప్పి వీరంగం వేసిన ప్రయాణికుడు

08-04-2021 Thu 21:56
  • ఎయిర్‌ఏషియా సిబ్బందితో అనుచిత ప్రవర్తన
  • మద్యం సేవించి ఉంటాడని అనుమానం
  • ఏఏఐకి ఫిర్యాదు చేసిన సంస్థ
  • నెలరోజుల నిషేధం విధించే అవకాశం
A man unruly behavior with Crew stripped off himself in airplane

ఢిల్లీ-బెంగళూరు ఎయిర్‌ఏషియా విమానంలో సోమవారం ఓ ప్రయాణికుడు వీరంగం వేశాడు. బట్టలు విప్పి సిబ్బందితో అనుచితంగా ప్రవర్తిస్తూ, ఇటాలియన్ ముద్దు ఇమ్మంటూ సిబ్బందిని ఇబ్బంది పెట్టాడు. గద్దించి కూర్చొబెట్టగా.. కాసేపు స్థిమితంగా ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి అదే విపరీత బుద్ధిని ప్రదర్శించాడు. అతగాడి తీరుతో తోటి ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఈ ఘటనపై ఎయిర్‌ఏషియా.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కి నివేదిక అందజేసింది.

అతడి ప్రవర్తనతో విస్తుపోయిన సిబ్బంది..ఏమైనా మత్తు పదార్థాలు సేవించాడేమోనని పరిశీలించారు. అదేమీ లేదని తెలిపిన సదరు ప్రయాణికుడు.. సిబ్బందికి క్షమాపణలు కూడా చెప్పాడు. అలా కాపేపు శాంతంగా కూర్చున్నాడు. కాసేపైన తర్వాత చూస్తే బట్టలు విప్పి కూర్చొని ఉన్నాడు. సిబ్బంది గద్దించగా తిరిగి బట్టలు వేసుకున్నాడు. విమానం ల్యాండ్‌ అయ్యే సమయంలో మరోసారి అలాగే వింతగా ప్రవర్తించాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది సెక్యురిటీ స్టాఫ్‌కి సమాచారం అందజేశారు. వారు అదుపులోకి  తీసుకున్న తర్వాత కూడా మరోసారి బట్టలు విప్పడం గమనార్హం. అలాగే ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో ల్యాప్‌టాప్‌ను తీసి నేలకేసి కొట్టాడు.

దీనిపై స్పందించిన ఎయిర్‌ఏషియా అధికారులు ఆ ప్రయాణికుడు మద్యం సేవించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఏఏఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.  అతడి విమాన ప్రయాణాలపై 30 రోజులు నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.