పవన్ కాదంటే 'వకీల్ సాబ్' ఆ హీరోతో చేసేవాడట!

08-04-2021 Thu 19:36
  • రేపే 'వకీల్ సాబ్' రిలీజ్
  • జోరుగా జరుగుతున్న ప్రమోషన్స్
  • నాగార్జున పేరును ప్రస్తావించిన వేణు శ్రీరామ్
If pavan Kalyan rejects Vakeel Saab movie Nagarjuna would do that

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' సినిమా రూపొందింది. ఒక బలహీనురాలిని కాపాడటం కోసం ఒక బలవంతుడితో పోరాడే వకీల్ కథ ఇది. ఈ సినిమాలో అంజలి .. నివేదా థామస్ .. అనన్య ముఖ్యమైన పాత్రలను పోషించారు. 'దిల్' రాజు నిర్మించిన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఒక వైపున వేణు శ్రీరామ్, మరో వైపున అంజలి .. అనన్య ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సంబంధించిన అనేక విషయాలను వేణు శ్రీరామ్ పంచుకున్నాడు.

"మొదటి నుంచి కూడా నేను పవన్ కల్యాణ్ అభిమానిని. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం 'దిల్' రాజుగారికి తెలుసు. అందువలన నేను మరింత కేర్ తీసుకుని చేస్తానని ఆయన నాకు ఈ ప్రాజెక్టును అప్పగించారు" అని చెప్పాడు. ఒకవేళ పవన్ కల్యాణ్ గారు ఈ సినిమా చేయనని అంటే, అప్పుడు ఈ కథ కోసం ఏ హీరోను ఎంచుకునేవారు? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, "నాగార్జున గారిని ఎంచుకునేవాడిని .. ఎందుకంటే ప్రయోగాలు చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు" అని చెప్పుకొచ్చాడు.