నాకు కరోనా సోకిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు: అంజలి

08-04-2021 Thu 18:15
  • టాలీవుడ్ లో కరోనా కలకలం
  • పలువురు సినీ తారలకు పాజిటివ్
  • అంజలికి కూడా కరోనా అంటూ ప్రచారం
  • ఓ ప్రకటనలో ఖండించిన అంజలి
  • తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడి
Anjali condemns news that she was tested corona positive

ఇటీవల పలువురు సినీ తారలు వరుసగా కరోనా బారినపడడం తెలిసిందే. అయితే తనకు కూడా కరోనా సోకిందంటూ మీడియాలో ప్రచారం జరుగుతోందని, ఆ వార్తల్లో నిజం లేదని అందాల తార అంజలి వెల్లడించింది. తనకు కరోనా పాజిటివ్ అంటూ కొన్ని వెబ్ సైట్లలో కథనాలు వస్తున్నాయని, అవి తన దృష్టికి వచ్చాయని వివరించింది. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, శ్రేయోభిలాషులు, స్నేహితులు, అభిమానులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది.

తనకు కరోనా లేదని సంతోషంగా చెబుతున్నానని అంజలి ఓ ప్రకటనలో పేర్కొంది. అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా ఉండాలని సూచించింది. అంజలి నటించిన 'వకీల్ సాబ్' చిత్రం రేపు విడుదల కానుంది. ఈ చిత్రంలో నటించిన నివేదా థామస్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.