తెరపైకి మరో టైమ్ మిషన్ కథ .. కాలంలో 500 ఏళ్లు వెనక్కి!

08-04-2021 Thu 17:19
  • టైమ్ మిషన్ నేపథ్యంలో వచ్చిన 'ఆదిత్య 369'
  • అదే తరహా కథను ఎంచుకున్న కల్యాణ్ రామ్
  • త్వరలోనే పూర్తి వివరాల వెల్లడి   
Kalyan Ram next project is on time machine

అప్పుడెప్పుడో తెలుగు తెరపైకి టైమ్ మిషన్ కథ వచ్చింది. బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఆ టైమ్ మిషన్ లో కృష్ణదేవరాయల కాలానికి కథను తీసుకెళ్లినప్పుడు ప్రేక్షకులు పొందిన అనుభూతి అంతా ఇంతా కాదు. ఆ సినిమాకి సీక్వెల్ తీయడానికి ఆ తరువాత ప్రయత్నాలు చేసినా కుదరలేదు.

ఈ నేపథ్యంలో దాదాపు అలాంటి టైమ్ మిషన్ కథతో .. తనే హీరోగా కల్యాణ్ రామ్ ఒక సినిమాను నిర్మించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడనేది తాజా సమాచారం. కొంతకాలంగా సైన్స్ ఫిక్షన్ కథ కోసం కల్యాణ్ రామ్ వెయిట్ చేస్తున్నాడట. ఇటీవల వేణు మల్లిడి వినిపించిన ఒక లైన్ నచ్చడంతో, దానిపైనే కసరత్తు మొదలుపెట్టారట. మొత్తానికి కథకు ఒక ఆసక్తికరమైన రూపాన్ని తీసుకొచ్చారని అంటున్నారు.

 కథానాయకుడు టైమ్ మిషన్లో .. కాలంలో 500 ఏళ్లు వెనక్కి వెళతాడట. అక్కడ ఆయనకి ఎలాంటి సమస్య ఎదురైంది? దాని నుంచి ఆయన ఎలా బయటపడ్డాడు? అనేదే కథ. ఈ కథకి భారీ సెట్స్ అవసరమవుతాయి. ప్రస్తుతం వాటి డిజైన్స్ గీయిస్తున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తివివరాలు వెల్లడించనున్నారు.