జనగామ జిల్లా పెంబర్తిలో లంకె బిందె లభ్యం

08-04-2021 Thu 14:35
  • పొలం చదును చేస్తుండగా ఘటన
  • లంకె బిందెలో 17 తులాల బంగారం, 10 కిలోల వెండి
  • జిల్లా మొత్తం పాకిపోయిన వార్త
  • వెంచర్ వద్దకు చేరుకున్న అడిషనల్ కలెక్టర్, పోలీసులు
Treasure pot found in Pembarti village in Janagam district

భూమి తవ్వకాల్లో నిధులతో కూడిన లంకె బిందెలు దొరకడం గతంలోనూ అనేక పర్యాయాలు జరిగింది. తాజాగా జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో ఓ రైతు పొలంలో లంకె బిందె లభ్యం కాగా, ఈ వార్త కొద్దిసేపట్లోనే దావానలంలా వ్యాపించింది. భూమిలో వెంచర్ ఏర్పాటు చేసేందుకు జేసీబీతో మట్టిని చదును చేస్తుండగా, ఓ చోట లంకె బిందె కనిపించింది. ఆ బిందెలో 17 తులాల బంగారంతో పాటు 10 కేజీల వెండి కూడా లభ్యమైంది. లంకె బిందె వ్యవహారం జిల్లా మొత్తం పాకిపోవడంతో అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, తహసీల్దార్ రవీందర్, సర్పంచ్ ఆంజనేయులు, పోలీసు సిబ్బంది ఆ వెంచర్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా ఆ బిందెలోని ఆభరణాలు కాకతీయుల కాలం నాటివని భావిస్తున్నారు.