CBSE: పరీక్షలను రద్దు చేయాలన్న విద్యార్థుల డిమాండ్లపై సీబీఎస్ఈ బోర్డు స్పందన!

  • పరీక్షలకు సురక్షిత ఏర్పాట్లను చేశాం
  • అన్ని కోవిడ్ నిబంధనలను పాటిస్తాం
  • పరీక్షా కేంద్రాల సంఖ్యను 50 శాతం పెంచాం
CBSE responds on demands of students to cancel exams

కరోనా మహమ్మారి ప్రభావం విద్యార్థులపై తీవ్ర స్థాయిలో పడుతోంది. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో, పరీక్షలను రద్దు చేయాలని, కుదరని పక్షంలో ఆన్ లైన్ ద్వారా పరీక్షలను నిర్వహించాలంటూ 10వ తరగతి, 12వ తరగతులకు చెందిన దాదాపు లక్షకు పైగా సీబీఎస్ఈ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 'క్యాన్సిల్ బోర్డ్ ఎగ్జామ్స్ 2021' అనే హ్యాష్ ట్యాగ్ గత రెండు రోజులుగా ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతోంది.

ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు, కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) స్పందించాయి. పరీక్షలకు సంబంధించి అన్ని సురక్షిత ఏర్పాట్లను చేశామని తెలిపాయి. పరీక్షల సమయంలో అన్ని కోవిడ్ నిబంధనలను పాటిస్తున్నట్టు పేర్కొన్నాయి. సామాజికదూరం కోసం పరీక్షా కేంద్రాల సంఖ్యను మరో 40-50 శాతం పెంచామని తెలిపాయి.

మరోవైపు గత వారం సీబీఎస్ఈ ఒక కీలక ప్రకటన చేసింది. ఎవరైనా విద్యార్థి కానీ, వారి కుటుంబంలోని ఎవరైనా కానీ కరోనాతో బాధపడుతుంటే... ప్రస్తుతం జరుగుతున్న ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కు కరోనా వల్ల వారు హాజరుకాలేకపోతే... అలాంటి వారందరికీ ఒక నిర్దిష్ట సమయంలో మరోసారి పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. అయితే, థియరీ పరీక్షలకు ఇదే వెసులుబాటును కల్పిస్తారా? అనే విషయంపై మాత్రం బోర్డు క్లారిటీ ఇవ్వలేదు.

More Telugu News