ఉసేన్ బోల్ట్ ట్వీట్ పై కోహ్లీ, డివిలియర్స్ స్పందన

08-04-2021 Thu 12:21
  • నేను ఇంకా వేగంగా పరుగులు చేయగలనన్న బోల్ట్
  • నీ శక్తిసామర్థ్యాలు మాకు తెలుసన్న కోహ్లీ
  • ఎక్కువ పరుగులు అవసరమైనప్పుడు ఎవర్ని పిలవాలో మాకు తెలుసన్న డివిలియర్స్
Kohli reaction to Usain Bolt tweet

రేపటి నుంచి ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభంకాబోతోంది. క్రికెట్ అభిమానులను 50 రోజుల పాటు ఐపీఎల్ ఉర్రూతలూగించబోతోంది. తొలిపోరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరగబోతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ స్ప్రింటర్, పరుగుల చిరుత ఉస్సేన్ బోల్ట్ బెంగళూరు జట్టును ఉద్దేశించి సరదాగా ఒక ట్వీట్ చేశాడు.

'ఛాలెంజర్స్ మీకొక విషయాన్ని తెలిజేస్తున్నా... నేను ఇంకా వేగంగా పరుగులు చేయగలను' అని కామెంట్ చేశాడు. ఈ ట్వీట్ ను కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ప్యూమా క్రికెట్, ఆర్సీబీ జట్టుకు ట్యాగ్ చేశాడు. ఆర్సీబీ అధికార కిట్ స్పాన్సర్ ప్యూమా అనే విషయం తెలిసిందే.

మరోవైపు ఉస్సేన్ బోల్ట్ ట్వీట్ పై ఏబీ డివిలియర్స్ స్పందించాడు. ఎక్కువ పరుగులు అవసరమైనప్పుడు ఎవర్ని పిలవాలో తమకు తెలుసని అన్నాడు. కోహ్లీ స్పందిస్తూ, నీ శక్తి సామర్థ్యాలపై ఎవరికీ అనుమానం లేదని... అందుకే నిన్ను ఆర్సీబీలోకి తీసుకున్నామని తెలిపాడు. మరోవైపు ఇంతవరకు ఆర్సీబీ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ ని గెలవలేదు. దీంతో, ఈసారైనా తమ జట్టు కప్ ను గెలవాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు.