TTD: శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న చంద్ర‌బాబు.. మ‌నుషుల‌ను దేవుళ్ల‌తో పోల్చ‌డం స‌రికాద‌ని వ్యాఖ్య ‌

  • నేను న‌మ్మిన దేవుడు వెంక‌టేశ్వ‌ర‌స్వామి
  • 2003లో నాపై దాడి జ‌రిగినప్పుడు కాపాడాడు
  • ధ‌ర్మాన్ని కాపాడితే అది మ‌న‌ల్ని కాపాడుతుంది
chandrababu visits ttd

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేప‌థ్యంలో త‌మ‌ అభ్యర్థి పనబాక లక్ష్మి త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌డానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆ నియోజ‌క వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. మొద‌ట రేణిగుంటకు చేరుకుని ప‌లువురు నేత‌ల‌తో క‌లిసి తిరుమలకు వెళ్లి శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఆయ‌న‌కు అర్చ‌కులు తీర్థ‌ప్ర‌సాదాలు అందించి, ఆశీర్వ‌దించారు.

అనంత‌రం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ... తాను న‌మ్మిన దేవుడు వెంక‌టేశ్వ‌ర‌స్వామి అని వ్యాఖ్యానించారు. శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌ని తెలిపారు.  2003లో త‌న‌పై  దాడి జ‌రిగినప్పుడు వెంక‌టేశ్వ‌ర స్వామే కాపాడార‌ని ఆయ‌న అన్నారు. ధ‌ర్మాన్ని కాపాడితే అది మ‌న‌ల్ని కాపాడుతుంద‌ని చెప్పారు.

మ‌నుషుల‌ను దేవుళ్ల‌తో పోల్చ‌డం స‌రికాద‌ని చెప్పారు. మ‌నిషి ఎప్పుడూ దేవుడు కాలేడ‌ని, మ‌నిషి మ‌నిషేన‌ని, దేవుడు దేవుడేన‌ని వ్యాఖ్యానించారు. తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంద‌ని తెలిపారు. కోట్ల మంది మ‌నోభావాల‌కు సంబంధించిన అంశాల‌పై బాధ్య‌త‌గా ఉండాల‌ని చెప్పారు.
 
కాగా, ఇటీవ‌లే తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జగన్‌ను క‌లిసిన‌ టీటీడీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు జ‌గ‌న్‌ను విష్ణుమూర్తి ప్రతిరూపంగా అభివర్ణించ‌డం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు అలా వ్యాఖ్యానించినట్టుగా అర్థమవుతోంది.

More Telugu News