లాక్‌డౌన్ భయంతో ఢిల్లీని వీడుతున్న వలస కార్మికులు

08-04-2021 Thu 11:38
  • ఢిల్లీలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులు
  • పెద్ద ఎత్తున నగరాన్ని వీడుతున్న వలస కార్మికులు
  • ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న బస్సులు
Migrant Workers Leaving Delhi Amid Lockdown Rumours

రోజురోజుకు ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరిగిపోతుండడంతో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ సహా పలు ఆంక్షలు విధించింది. కేసులు ఇలాగే పెరుగుతూ పోతే లాక్‌డౌన్ విధిస్తారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో నగరంలోని వలస కార్మికులు తిరిగి సొంతూళ్లకు పయనమవుతున్నారు. అకస్మాత్తుగా లాక్‌డౌన్ విధిస్తే తిప్పలు తప్పవని భావిస్తున్న కార్మికులు ముందుగానే మేల్కొన్నారు. పిల్లా పాపలతో కలిసి సొంతూళ్లకు తరలుతున్నారు.

గతేడాది లాక్‌డౌన్‌లో చిక్కుకుని చాలా ఇబ్బందులు పడ్డామని, ఈసారి అలాంటి పరిస్థితులు రాకూడదనే స్వగ్రామాలకు వెళ్లిపోతున్నట్టు జార్ఖండ్, బీహార్ సహా పలు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు పేర్కొన్నారు. కార్మికులు పెద్ద ఎత్తున నగరాన్ని ఖాళీ చేస్తుండడంతో బస్సులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.  కాగా, కరోనా మహమ్మారి కట్టడికి కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు నగరంలో నైట్‌ కర్ఫ్యూ విధించింది.