తమిళనాడులో బైక్‌పై ఈవీఎంల తరలింపు.. ముగ్గురు ఉద్యోగులపై వేటు

08-04-2021 Thu 11:13
  • వేళచ్చేరి నియోజకవర్గంలో ఘటన
  • ఈవీఎంలను తరలిస్తున్న వారిని పోలీసులకు అప్పగింత
  • వారి నుంచి రూ. 1.12 లక్షలు, సెల్‌ఫోన్లు స్వాధీనం
  • డబ్బులపై ఆరా తీస్తున్న అధికారులు
GCC Suspended Three Employees for having EVMs

తమిళనాడులో బైక్‌పై ఈవీఎంలను తరలిస్తున్న వ్యవహారానికి సంబంధించి ముగ్గురు అధికారులపై ఎన్నికల సంఘం వేటేసింది. చెన్నైలోని వేళచ్చేరి నియోజకవర్గంలో మొన్న పోలింగ్ ముగిసిన తర్వాత ముగ్గురు ఉద్యోగులు బైక్‌పై ఈవీఎంలను తరలించారు. ఇది చూసిన స్థానికులు వారిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఈవీఎంలు మొరాయించడంతో వాటిని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి తరలిస్తున్నట్టు వారు చెప్పారు.

దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు ఈవీఎంలతో పట్టుబడిన వారు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) సిబ్బంది అని గుర్తించారు. వారి నుంచి రూ. 1.12 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. వారికి ఆ డబ్బు ఎవరిచ్చారనే దానిపైనా దర్యాప్తు ప్రారంభించారు. అలాగే, వారి నుంచి సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈవీఎంల తరలింపునకు ముందు వారు ఎవరెవరితో మాట్లాడారన్న దానిపైనా ఆరా తీస్తున్నారు.

కాగా, ఈవీఎంలతో పట్టుబడిన ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్టు జీసీసీ కమిషనర్, ఎన్నికల అధికారి ప్రకాశ్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈవీఎంలు బయటకు రావడంతో స్పందించిన వేళచ్చేరి కాంగ్రెస్ అభ్యర్థి హాసన్ మౌలానా రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.