ఫిల్మ్ ట్రైబ్యునల్‌ను రద్దు చేస్తూ కేంద్రం అత్యవసర ఆదేశాలు.. సినీ రంగానికి దుర్దినమన్న దర్శకుడు విశాల్ భరద్వాజ్

08-04-2021 Thu 10:42
  • ఎఫ్ఏసీటీ సహా పలు ట్రైబ్యునళ్ల రద్దు
  • 19కి పడిపోనున్న ట్రైబ్యునళ్ల సంఖ్య
  • బిల్లుకు పార్లమెంటు అనుమతి లభించకపోవడంతో అత్యవసర ఆదేశాలు
  • ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు
Film Certification Appellate Tribunal abolished

ఫిల్మ్ సర్టిఫికేషన్ అపిలేట్ ట్రైబ్యునల్ (ఎఫ్‌ఏసీటీ) సహా ప్రజలకు పెద్దగా అవసరం లేని మరికొన్ని ట్రైబ్యునళ్లను రద్దు చేస్తూ కేంద్రం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ) నుంచి సినిమాలకు సర్టిఫికెట్ పొందడంలో ఏవైనా సమస్యలు ఉంటే నిర్మాతలు ఇప్పటి వరకు ఎఫ్ఏసీటీని ఆశ్రయించేవారు. ఇప్పుడు దీనిని రద్దు చేయడంతో ఇకపై వారు హైకోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రస్తుతం ఉన్న 26 ట్రైబ్యునళ్ల స్థానంలో 19 మాత్రమే ఉండనున్నాయి.

 నిజానికి ఈ నిర్ణయానికి సంబంధించిన బిల్లును ఫిబ్రవరిలోనే కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ ఆమోదం లభించలేదు. దీంతో అత్యవసరంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఎఫ్ఏసీటీని రద్దు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల సినిమాల విడుదలలో ఆలస్యం జరుగుతుందని, సినీ రంగానికి ఇదో దుర్దినమని దర్శకుడు విశాల్ భరద్వాజ్ మండిపడ్డారు.