బ్రెజిల్‌లో కరోనా బీభత్సం.. 4 వేలు దాటిన మరణాల సంఖ్య

08-04-2021 Thu 10:06
  • కరోనాతో బ్రెజిల్ కకావికలు
  • ఒక్క రోజులో ఇన్ని మరణాలు సంభవించిన మూడో దేశంగా బ్రెజిల్
  • 5.7 లక్షల మరణాలతో తొలి స్థానంలో అమెరికా
In 24 hours over 4000 people died due to corona in Brazil

గతేడాది బ్రెజిల్‌ను కకావికలు చేసిన కరోనా మహమ్మారి అక్కడ మరోమారు చెలరేగిపోతోంది. దాని దెబ్బకు వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. మొన్న ఒక్క రోజే ఆ దేశంలో 4,195 మంది కరోనాకు బలయ్యారు. ఫలితంగా దేశంలో కరోనా మరణాల సంఖ్య 3.40 లక్షలకు చేరువైంది.

5.7 లక్షల కరోనా మరణాలతో అమెరికా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. అంతేకాదు, 24 గంటల వ్యవధిలో నాలుగు వేల మరణాలు సంభవించిన మూడో దేశం కూడా బ్రెజిలే కావడం గమనార్హం. గతంలో అమెరికా, పెరూలో మాత్రమే ఒక్క రోజులో ఇన్ని మరణాలు సంభవించాయి.