నేడు ముఖ్య‌మంత్రుల‌తో ప్రధాని మోదీ సమావేశం.. మమత దూరం

08-04-2021 Thu 09:58
  • సాయంత్రం 6.30 గంటలకు వర్చువల్ ప‌ద్ధ‌తిలో  సమావేశం
  • క‌రోనా విజృంభ‌ణ‌పై చ‌ర్చ‌
  • తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సూచ‌న‌లు
modi to discuss with cms

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య ప్ర‌తి రోజు ల‌క్ష‌కు దాటి న‌మోద‌వుతుండ‌డంతో అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మ‌రోసారి భేటీ కానున్నారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు వర్చువల్ ప‌ద్ధ‌తిలో ఈ సమావేశం జ‌ర‌గ‌నుంది.  క‌రోనా విజృంభ‌ణ‌తో పాటు దేశ వ్యాప్తంగా కొన‌సాగుతోన్న‌ వ్యాక్సినేషన్ పై ఆయ‌న‌ చర్చించనున్నారు.

క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతోన్న నేప‌థ్యంలో కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయ‌న‌ దిశా నిర్దేశం చేయనున్నారు. ముఖ్య‌మంత్రుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. దేశంలో క‌రోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల విష‌యంలో తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై ఆయ‌న ప‌లు సూచ‌న‌లు చేయ‌నున్నారు.

ఢిల్లీ స‌హా ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా క‌ట్ట‌డికి క‌ర్ఫ్యూ, ఆంక్ష‌లు విధించ‌డం వంటి కీల‌క అంశాల‌పై ఆయ‌న చ‌ర్చించ‌నున్నారు. మ‌హారాష్ట్ర‌లో వైర‌స్ క‌ట్ట‌డి కోసం ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం  బృందాల‌ను పంపింది. క‌రోనా క‌ట్ట‌డి కోసం రాష్ట్రాల‌కు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది.

కాగా, ఈ సమావేశంలో ప‌శ్చిమ‌ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొనడం లేదని సమాచారం. ఆమె స్థానంలో ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ హాజరవుతారని తెలుస్తోంది. దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించడం ఐదు రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.