MPTC: ఏపీలో కొనసాగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్.. భారీగా తరలివస్తున్న ఓటర్లు

  • 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీలకు ఎన్నికలు
  • ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్
  • ఏజెన్సీ ప్రాంతాల్లో 2 గంటలకే పోలింగ్ బంద్
  • విజయనగరం జిల్లా అంటిపేటలో పోలింగ్ రేపటికి వాయిదా
  • చెరుకూరు ఎంపీటీసీ-1 స్థానంలో నిలిచిపోయిన పోలింగ్
ZPTC and MPTC Elections Continue in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఉదయం ప్రారంభమైన పరిషత్ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీల ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 7,220 ఎంపీటీసీ స్థానాలకు 18,782 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

కాగా, 126 జడ్పీటీసీ, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తం  27,751 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, వీటిలో  6,492 సమస్యాత్మక, 6,314 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. 247  పోలింగ్ కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక, రాష్ట్రవ్యాప్తంగా 2,46,71,002 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  కాగా, వివిధ కారణాల వల్ల 375 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు.

ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. కాగా, పోలింగ్ కేంద్రానికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లను వేరే కేంద్రానికి పంపడంతో అవి లేక ప్రకాశం జిల్లా చెరుకూరు ఎంపీటీసీ-1 స్థానంలో పోలింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్ పేపర్లలో తప్పుల కారణంగా విజయనగరం జిల్లా సీతానగరం మండలంలోని అంటిపేటలో పోలింగ్ రేపటికి వాయిదా పడింది. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మాముడూరులో వైసీపీ ఏజెంట్ల దాడిలో మహిళా అభ్యర్థులకు గాయాలు కావడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలింగును తాత్కాలికంగా నిలిపివేశారు.

More Telugu News