చెల్లిపైనే పలుమార్లు అత్యాచారం... చివరికి ఉరేసుకుని ఆత్మహత్య!

08-04-2021 Thu 09:40
  • కొత్తగూడెంలో ఘటన
  • ఎన్నో ఏళ్లుగా చెల్లిపై అత్యాచారం
  • పెద్దమ్మ ఇంటికి వెళితే అక్కడా ఇదే పరిస్థితి
  • కేసు పెట్టిన బాధితురాలు
  • ఆత్మహత్య చేసుకున్న పెద్దమ్మ కుమారుడు
Young Man Sucide after Rape on Sister

వావి వరసలు మరచిపోయి, తోడబుట్టిన చెల్లెలిపై ఎన్నో ఏళ్లుగా అత్యాచారం చేసి, ఇప్పుడా యువతి పోలీసులను ఆశ్రయించడంతో, మనస్తాపం చెందిన నిందితుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తగూడెంలో కలకలం రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, 20 సంవత్సరాల ఓ యువతి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి, తగిన ఆధారాలు సమర్పిస్తూ, తన సోదరుడితో పాటు, వరసకు సోదరుడయ్యే పెద్దమ్మ కొడుకు కూడా అఘాయిత్యం చేశాడని ఫిర్యాదు చేసింది.

తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడని, ఆపై చిన్న వయసు నుంచి సొంత అన్నయ్య పలుమార్లు లైంగిక దాడి చేశాడని, ఈ విషయాన్ని తల్లికి చెప్పినా వినలేదని, దీంతో తాను పెదనాన్న, పెద్దమ్మ దగ్గరకు వెళితే, వారి కొడుకు కూడా అదే పని చేశాడని, తన బాధను పెద్దలకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది.

కాగా, యువతి ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు రిజిస్టర్ చేసి విచారణ ప్రారంభించగా, ఈ కేసు కారణంగా జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడ్డాడో, లేక మనస్తాపానికి గురయ్యాడో తెలియదుగానీ, బాధితురాలి పెదనాన్న కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లండన్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న అతను రెండు వారాల క్రితం ఇండియాకు వచ్చాడు. గతంలో తాను చేసిన తప్పులపై కేసు రిజిస్టరైందని తెలుసుకున్నాడు.

బాధితురాలితో ఫోన్ లో మాట్లాడుతూ, తన తప్పు బయటకు వస్తే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. ఈ కేసులో ఓ నిందితుడు ఉరేసుకున్నాడన్న విషయం తెలుసుకుని, పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బాధితురాలి సొంత అన్నను అరెస్ట్ చేయాల్సి వుందని పోలీసులు వెల్లడించారు.