Mrs World: ‘మిసెస్ శ్రీలంక’ అందాల పోటీలను రసాభాసగా మార్చిన 'మిసెస్ వరల్డ్' .. వీడియో వైరల్

  • 'మిసెస్ శ్రీలంక'గా పుష్పిక డి సిల్వ
  • విడాకులు తీసుకున్న వారు అర్హులంటూ మండిపడిన మిసెస్ వరల్డ్  
  • పుష్పిక తలపై నుంచి విసురుగా కిరీటాన్ని లాగేసిన వైనం
Mrs World 2019 snatches Sri Lankan pageant winners crown off her head

మిసెస్ శ్రీలంక పోటీల ఫైనల్స్ వేడుకగా జరుగుతున్న వేళ ప్రస్తుతం 'మిసెస్ వరల్డ్'గా వున్న '2019 మిసెస్ శ్రీలంక' అయిన కరోలిన్ ఆ పోటీలను రసాభాసగా మార్చేసింది. ఈ పోటీల్లో మిసెస్ శ్రీలంకగా పుష్పిక డి సిల్వ విజయం సాధించింది. ఆమెకు కరోలిన్ కిరీటాన్ని తొడిగింది. దీంతో వేదిక మొత్తం కరళాతాల ధ్వనులతో ప్రతిధ్వనించింది.

అంతలోనే కరోలిన్ జోక్యం చేసుకోవడంతో గందరగోళం ఏర్పడింది. నిబంధనల ప్రకారం విడాకుల తీసుకున్న మహిళలకు కిరీటాన్ని స్వీకరించే అర్హత లేదని, కాబట్టి కిరీటం పొందే అర్హత రన్నరప్‌దేనని పేర్కొంది. అక్కడితో ఆగక.. పుష్పిక తలపై ఉన్న కిరీటాన్ని విసురుగా తీసుకుని, రన్నరప్ తలపై పెట్టడంతో జ్యూరీలు సహా అందరూ అవాక్కయ్యారు.

అంతేకాదు, కిరీటాన్ని బలవంతంగా తీసే క్రమంలో పుష్పికకు గాయాలు కూడా అయ్యాయి. అయినా అదేమీ పట్టించుకోని కరోలిన్ తీరు చూసి వేడుకలకు హాజరైన వారు విస్తుపోయారు. మరోవైపు, ఈ పరిణామంతో తీవ్ర నిరాశకు గురైన పుష్పిక  వేదిక వెనకవైపు నుంచి వెళ్లిపోయారు.

ఈ పరిణామాలపై పుష్పిక ఆ తర్వాత  ఫేస్ ‌బుక్ ద్వారా స్పందించారు. తాను విడాకులు తీసుకోలేదని, తాను కనుక విడాకులు తీసుకుని ఉంటే ఆ పత్రాలు సమర్పించాలని సవాలు విసిరారు. తనకు జరిగిన అవమానం, అన్యాయంపై చట్టపరంగా ముందుకెళ్తున్నట్టు చెప్పారు. ఇతరుల కిరీటాన్ని దోచుకునే మహిళ నిజమైన రాణి కాబోదని ఆ పోస్టులో డి సిల్వ మండిపడ్డారు.

మరోవైపు, ఈ వ్యవహారంపై అందాల పోటీల నిర్వాహకులు స్పందించారు. ఆమె విడాకులు తీసుకోలేదని చెబుతూ పుష్పికకు మళ్లీ కిరీటాన్ని అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశంలోని ఒంటరి తల్లులందరికీ ఈ కిరీటాన్ని అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. కాగా, కరోలిన్ వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉందని, మిసెస్ వరల్డ్ సంస్థ ఇప్పటికే ఆమెపై దర్యాప్తు ప్రారంభించిందని మిసెస్ శ్రీలంక వరల్డ్ డైరెక్టర్ పేర్కొన్నారు.

More Telugu News